Justice Yashwant Varma: అక్రమ నగదు కేసు - జడ్జి రాజీనామా..!!
నగదు స్వాధీనం వివాదం, అభిశంసన ప్రక్రియ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ శుక్రవారం తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు.తనపై ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత, జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. గత ఏడాది ఏప్రిల్ 5న ప్రమాణ స్వీకారం చేసిన ఆయనపై సుప్రీంకోర్టు నేతృత్వంలో అంతర్గత విచారణ జరిగింది. తదుపరి చర్యలకు ఈ విచారణ సిఫార్సు చేసింది.
రాజీనామ లేఖలో...
రాష్ట్రపతి కార్యాలయానికి తన మూలంగా చెడ్డపేరు రాకూడదని భావించి,జడ్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఏప్రిల్ 9వ తేదీన రాష్ట్రపతికి రాసిన లేఖలో జస్టిస్ వర్మ పేర్కొన్నారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు.

భారీగా నిల్వ ఉంచిన డబ్బు..
గతేడాది మార్చి నెల 14వ తేదీన జస్టిస్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో దాచి ఉన్న భారీ మొత్తంలో నగదు వెలుగులోకి వచ్చింది.అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు వెళ్లిన సమయంలో భారీ మొత్తంలో నగదు వారి కంట పడింది. ఆ సమయంలో జస్టిస్ వర్మ తన ఇంట్లో లేరు. ఈ వార్త ఒక్కసారిగా బయటకు పొక్కడంతో విచారణ సంస్థలు రంగంలోకి దిగాయి. దొరికిన ఆ డబ్బుకు సరైన లెక్కా పత్రాలు లేవు.
అంతర్గత విచారణకు ఆదేశం
ఈ ఘటన సుప్రీంకోర్టు అంతర్గత విచారణకు దారితీసింది. విచారణలో వెల్లడైన విషయాల ఆధారంగా, పార్లమెంటులో ఆయనపై అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది. లోక్‌సభ స్పీకర్ 146 మంది పార్లమెంటు సభ్యులు సంతకం చేసిన తీర్మానాన్ని ఆమోదించి, ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ ఆరోపణలను దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీలో జస్టిస్ అమిత్ కుమార్, జస్టిస్ మణిందర్ మోహన్ శ్రీవాస్తవ, అలాగే బీబీ ఆచార్య ఉన్నారు.
గత విచారణల్లో, అంతర్గత విచారణ ప్రక్రియను జస్టిస్ వర్మ మొదట్లోనే ఎందుకు సవాలు చేయలేదని, ముందుగా అందులో పాల్గొని తర్వాత అభ్యంతరాలు ఎందుకు లేవనెత్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని వర్మ వాదించారు. విచారణ ఫలితాలను, భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అభిశంసన సిఫార్సును సవాలు చేశారు.












Click it and Unblock the Notifications