వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్‌థాంగ్: కూనిరాగాలే వారి పేర్లు, మేఘాలయలోని కాంగ్‌థాంగ్ గ్రామంలో ఆచారం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కాంగ్‌థాంగ్ గ్రామ మహిళ

మేఘాలయలోని ఓ మారుమూల గ్రామంలో ప్రజలకు మూడు పేర్లు ఉంటాయి. మామూలుగా పెట్టే పేరు, ఓ కూనిరాగం, ఒక చిన్న ఆలాపన లాంటి ముద్దు పేరు.

భారతదేశానికి ఈశాన్య మూల మేఘాలయ రాష్ట్రంలోని పచ్చని తూర్పు ఖాసీ కొండల మధ్య ఉంది కాంగ్‌థాంగ్ గ్రామం.

ఆ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ నుంచి 3 గంటలు ప్రయాణిస్తే ఈ గ్రామానికి చేరుకుంటాం.

నాగరికతకు కొంచెం దూరంగా, చుట్టూ ఎత్తయిన కొండలు, లోతైన కనుమల మధ్య ప్రకృతికి దగ్గరగా జీవిస్తుంటారు ఇక్కడి ప్రజలు.

ఈ గ్రామానికి 'జింగ్‌వాయ్ యోబయ్’ అనే ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది.

పుట్టే పిల్లలకు ఈ సంప్రదాయం ప్రకారం సాధారణంగా ఒక పేరు పెడతారు. దానితో పాటు బిడ్డ తల్లి ఒక ప్రత్యేకమైన కూనిరాగాన్ని పేరుగా సూచిస్తారు.

సాధారణ పేరును రికార్డుల కోసం, అధికారిక పత్రాల్లో మాత్రమే ఉపయోగిస్తారు.

తల్లి పెట్టే కూనిరాగమే వారి గుర్తింపు అవుతుంది. ఆ ఊర్లో అందరూ వాళ్లను ఆ రాగంతోనే పిలుస్తారు.

జీవితాంతం వాళ్లకు అదే పేరుగా ఉంటుంది. వాళ్లు చనిపోతే ఆ రాగం కూడా వారితో పాటే భూమిలో కలిసిపోతుంది.

ప్రతి ఒక్కరికీ ఒక్కో కూనిరాగం ప్రత్యేకంగా ఉంటుంది. ఒకరికి పేరుగా పెట్టిన కూనిరాగాన్ని ఇంకొకరికి పెట్టరు. చనిపోయిన తరువాత కూడా ఆ రాగాన్ని మరొకరికి పెట్టరు.

'బిడ్డ పుట్టినప్పుడు తల్లి ఆనందానికి ప్రతీక ఇది'

ఈ ఆచారం తమ పూర్వీకుల నుంచి వచ్చిందని, శతాబ్దాలుగా దీన్ని ఇక్కడ పాటిస్తున్నారని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు.

"బిడ్డ పుట్టినప్పుడు తల్లికి కలిగే అంతులేని ఆనందానికి, ప్రేమకు ఇది ఒక విధమైన వ్యక్తీకరణ. ఇది తల్లి హృదయంలోంచి వచ్చిన పాట. జోలపాటలా సుతిమెత్తగా ఉంటుంది" అని ఖాసీ తెగకు చెందిన షిడియాప్ ఖోంగ్‌సిత్ అనే మహిళ చెప్పారు.

మేఘాలయలో ఉన్న మూడు తెగల్లో ఖాసీ ఒకటి. కాంగ్‌థాంగ్‌లో నివసించేవారంతా ఖాసీ తెగకు చెందినవారే.

ఆమె చాలా సాధారణంగా సంప్రదాయ పద్ధతిలో చీర కట్టుకుని ఉన్నారు. టీ తాగేందుకు వాళ్లింటికి మమ్మల్ని ఆహ్వానించారు.

తాటి పైకప్పుతో కట్టిన ఆ గుడిసెలో చెక్క నేలపై కూర్చున్నాం.

గుడిసెలో ఓ మూల ఉన్న పొయ్యి వెలిగించారు ఖోంగ్‌సిత్, ఆమె భర్త ఖోంగ్‌జీ. మంట పెద్దది కావడానికి గొట్టంతో ఊదుతున్నారు.

ఈలోగా ఖోంగ్‌సిత్ తమ నలుగురి పిల్లల పేర్లు పాడి వినిపించారు.

నాలుగూ కూడా 14 నుంచి 18 సెకెండ్ల నిడివి ఉన్న కూనిరాగాలు. ఒకదానితో ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా ఉన్నాయి.

"ఇవి పుట్టినప్పుడు పెట్టిన పేర్లు. దూరంగా కొండల్లో లేదా లోయల్లో ఉన్నవారిని పిలవడానికి ఇలా పూర్తి రాగం పాడతాం" అని ఆమె వివరించారు.

పూర్వం అడవికి వేటకు వెళ్లేటప్పుడు తప్పిపోకుండా ఇలా ఒకరినొకరు పిలుచుకుంటూ (పాడుకుంటూ) వెళ్లేవారు. అలాగే "దుష్ట శక్తులను పారదోలడానికి" కూడా ఈ కూనిరాగాలు సహాయపడతాయని వారి నమ్మకం.

"అడవుల్లో ఉండే దుష్ట శక్తులు మా పేర్ల రాగాల మధ్య తేడాను గుర్తించలేవని, అలాగే జంతువుల అరుపులు, మా పేర్ల మధ్య వ్యత్యాసాన్ని కూడా గుర్తించలేవని మా నమ్మకం. కాబట్టి కూనిరాగాలతో పిలిచినప్పుడు అవి మాకు హాని కలగించలేవు" అని ఖోంగ్‌సిత్ చెప్పారు.

విజిలింగ్ విలేజ్

రాగం తగ్గించి చిన్నచిన్న ఆలాపనలతో పిలుచుకుంటామని, అవి వారి ముద్దు పేర్లుగా చలామణి అవుతాయని ఆమె తెలిపారు.

సమీపంలోనే ఉన్నప్పుడు పూర్తి రాగం పాడక్కర్లేకుండా ఈ ముద్దు పేరుతో చిన్నగా పిలిస్తే చాలు.

దూరం నుంచి పిలిచినప్పుడు ఈ కూనిరాగాలు విజిల్స్‌లాగ వినిపిస్తాయి. అందుకే కాంగ్‌థాంగ్‌ను "విజిలింగ్ విలేజ్" అని కూడా పిలుస్తారు.

"ఈ ఆచారం ఎప్పుడు మొదలైందో ఎవరికీ కచ్చితంగా తెలీదు. కానీ, కాంగ్‌థాంగ్ ఆవిర్భావం నుంచి ఇది ఉనికిలో ఉందని చాలా మంది అంగీకరిస్తారు. సోహ్రా రాజ్య స్థాపనకు ముందు నుంచీ కాంగ్‌థాంగ్ ఉంది.

సమీపంలోని చిరపుంజిలో 16వ శతాబ్దంలో సోహ్రా రాజ్యం స్థాపించబడింది. ఆ లెక్క ప్రకారం చూస్తే, కాంగ్‌థాంగ్‌లో ఈ ఆచారం 500 ఏళ్ల పైబడి ఉన్నమాటే.

అయితే, ఈ సంప్రదాయం గురించి ఎక్కడా పుస్తకాల్లో చెప్పలేదు. ఇటీవలే దీని గురించి బయటకు తెలిసింది.

మాతృస్వామ్య పద్ధతులకు పుట్టినిల్లు

షిల్లాంగ్‌లో పుట్టి పెరిగిన డాక్టర్ పియాషి దత్తా ప్రస్తుతం దిల్లీ సమీపంలోని నోయిడాలో అమిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో అసిస్టంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

తన రీసెర్చ్‌లో భాగంగా మాతృస్వామ్యం గురించి పరిశోధిన్నప్పుడు కాన్‌థాంగ్ గురించి తెలిసిందని పియాషి దత్తా చెప్పారు.

"మేఘాలయలో మాతృస్వామ్య సమాజం ఉంది. మాతృస్వామ్య సంప్రదాయాలు, నీతి సూత్రాలు, ఆచారాలు వ్యవస్థలో లోతుగా పాతుకుని ఉన్నాయి. వీటిని ఒక తరం నుంచి మరో తరానికి మౌఖికంగా అందిస్తూ వస్తున్నారు. ఇందుకు కాంగ్‌థాంగ్ మినహాయింపు కాదు. కూనిరాగాలను పేర్లుగా పెట్టడం వారి సంస్కృతిలో భాగం. మాతృస్వామ్య పద్ధతులకు ఇది నిదర్శనం."

'జింగ్‌వాయ్ యోబయ్’ అంటే ఈ తెగలోని మూల వాసులు లేదా వారి జాతికి తల్లి (యోబయ్) గౌరవార్థం పాడిన రాగం (జింగ్‌వాయ్).

"ఈ ఆచారానికి ఒక అర్థం ఉంది. బిడ్డ పుట్టగానే కూనిరాగం పేరుగా పెట్టడం ద్వారా మూలవాసులకు వందనాలు సమర్పిస్తూ, వారి దీవెనలు కోరుతున్నట్లు అర్థం."

2016లో ఇండియన్ సోషియోలాజికల్ బులెటిన్‌లో కాంగ్‌థాంగ్‌పై దత్తా రాసిన వ్యాసం ప్రచురితమైంది. ఈ ఆచారానికి సంబంధించి రాతపూర్వకంగా వచ్చిన తొలి పత్రం ఇదే.

అదే సంవత్సరం, పలు అవార్డులు గెలుచుకున్న భారతీయ చలనచిత్ర దర్శకుడు ఒయినం డోరెన్ కాంగ్‌థాంగ్‌పై 52 నిముషాల నిడివిగల డాక్యుమెంటరీ తీశారు.

ఆ డాక్యుమెంటరీ పేరు "మై నేమ్ ఈజ్ ఈయూఓవ్".

కాంగ్‌థాంగ్‌కే ప్రత్యేకమైన 'జింగ్‌వాయ్ యోబయ్’ సంప్రదాయం ప్రధానంగా సాగే ఈ చిత్రంలో, పుట్టిన బిడ్డలు ఆధునికత నేర్చి ఇతర పట్టణాలకు పయనమైతే ఈ మాతృస్వామ్య సంప్రదాయం ఏమవుతుంది? అనే అంశాన్ని చర్చించారు.

ఈ చిత్రం, బ్రిస్టల్‌లో జరిగిన 15వ ఆర్ఏఐ(RAI) ఫిల్మ్ ఫెస్టివల్‌లో టాంజిబుల్ కల్చర్ బహుమతి గెలుచుకుంది.

కాంగ్‌థాంగ్‌లో ప్రాథమిక స్థాయి వరకే విద్యా సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఈ గ్రామం నుంచి షిల్లాంగ్ లేదా ఇతర పట్టణాలకు వలస వెళ్లడం అనేది ఇటీవల వరకు వారు కనీవినీ ఎరుగరు.

అయితే ఈమధ్య కాలంలో యువత పై చదువుల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం నగరాల బాట పడుతున్నారు. వారంతా తమ సంప్రదాయాలకు దూరంగా జరుగుతుండవచ్చు.

"ఇది వారి సమాజమే పరిష్కరించుకోవాల్సిన అంశం. పూర్వీకుల ఆచారం గురించి దాని ప్రాముఖ్యత గురించి తెలియజేసేలా చర్చలు, సమావేశాలు జరపడం, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినా ఈ ఆచారాన్ని ఎలా కొనసాగించవచ్చో చర్చించడం అవసరం" అని దత్తా అభిప్రాయపడ్డారు.

'మా సంస్కృతిని ప్రోత్సహించడమే లక్ష్యం'

చాలావరకు వారిది వ్యవసాయ ఆధారిత సమాజం. ఇతర రంగాల్లో ఉపాధి సృష్టించడం ద్వారా యువత నగరాలకు తరలిపోకుండా ఆపవచ్చు. ఉదాహరణకు టూరిజంను అభివృద్ధి చేయడం.

రోథెల్ ఖోంగ్‌సిత్ ఉన్నత చదువుల కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం కాంగ్‌థాంగ్ నుంచి షిల్లాంగ్ వెళ్లారు. కానీ, ఇప్పుడు మళ్లీ పుట్టిన ఊరికి తిరిగొచ్చారు.

ప్రస్తుతం ఆయన కాంగ్‌థాంగ్ గ్రామ అభివృద్ధి కమిటీకి ఛైర్మన్‌గా, గ్రామంలోని దేశీయ ఆగ్రో టూరిజం కో-ఆపరేటివ్ సొసైటీకి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

"పెద్ద నగరంలో మంచి ప్రభుత్వ ఉద్యోగంతో నాకు తృప్తి కలగలేదు. నా మనసు ఎప్పుడూ మా గ్రామంలోనే ఉండేది. మా సంస్కృతిని ప్రోత్సహించాలన్నదే నా కోరిక" అని రోథెల్ చెప్పారు.

ఇటీవల వరకు వారి ప్రత్యేకమైన సంప్రదాయం సందర్శకులను ఆకర్షిస్తుందని మా గ్రామస్థులకు తెలీదని రోథెల్ అన్నారు.

"మావరకు ఇది మా డీఎన్ఏలో కలిసిపోయింది. మ ఊర్లో మహిళలకు రాగాలను ఎలా కూర్చాలో నేర్పించక్కర్లేదు. బిడ్డ పుట్టగానే తల్లి హృదయంలోంచి దానంతట అదే బయటికొస్తుంది. మాతృభాష ఎలా నేర్చుకుంటామో అలాగే మాకు పెట్టిన కూనిరాగాల పేర్లను మేం నేర్చుకుంటాం."

ఆలస్యంగానైనా వారి గ్రామం, వారి ఆచారాల గురించి బయట ప్రపంచానికి తెలియడంతోపాటు, రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందడంతో సందర్శకులు పెరుగుతున్నారు. ఇప్పుడిప్పుడే ఈ గ్రామం ప్రత్యేకత బయటికొస్తోంది.

2014లో కాంగ్‌థాంగ్‌కు రోడ్డు పడింది. అలాగే ఓ ఏడాది తరువాత పర్యటకుల కోసం సంప్రదాయ పద్ధతుల్లో వెదురు బొంగులతో ఒక అతిథి గృహాన్ని నిర్మించారు.

అప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాతాల నుంచి వచ్చే సందర్శకుల తాకిడి పెరిగింది.

ఈ సెప్టెంబర్‌లో యూఎన్‌డబ్ల్యూటీఓ ఇచ్చే ఉత్తమ పర్యాటక గ్రామం అవార్డుకు కాంగ్‌థాంగ్ ఎంపికైంది.

"సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాలలో పర్యటక రంగంలో వినూత్నమైన, పరివర్తనాత్మక విధానాలను అమలులోకి తెచ్చే ఊర్లకు" ఈ అవార్డు ఇస్తారు.

కాంగ్‌థాంగ్ గ్రామం ప్రకృతికి దగ్గరగా ఉండడమే కాకుండా చాలా శుభ్రంగా ఉంటుంది. ఎక్కడా చెత్తకుప్పలు కనిపించవు.

పూరిళ్లు, తాటాకు పైకప్పు గుడిసెలతో ఆకర్షణీయంగా ఉంటుంది. కొండల మధ్య లోయలు సుందర దృశ్యాలతో కనువిందు చేస్తాయి.

కాంగ్‌థాంగ్‌ను హెరిటేజ్ విలేజ్‌గా రూపొందించాలన్నదే తన ధ్యేయమని రోథెల్ చెప్పారు.

"ఊరికే వచ్చి ప్రకృతి రమణీయతను ఆస్వాదించి వెళిపోయేవారికి మా గ్రామాన్ని సందర్శించడం వలన పెద్దగా లాభం ఉండదు. ప్రత్యేకమైన అభిరుచి ఉండి, అరుదైన, ప్రత్యేకమైన సాంస్కృతిక అంశాలు, సంప్రదాయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి, ఇక్కడ మాత్రమే చూడగలిగే ఆచారాల గురించి విని తెలుసుకుని, అభినందించగలిగేవారికి మా గ్రామం మంచి పర్యటక స్థలంగా నిలుస్తుంది."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kangthang: The names of the hymns, a custom in the village of Kangthang in Meghalaya
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X