బెంగళూరు ఓటర్లకు బద్ధకం: ఆ నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగింపుదశకు వచ్చింది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఆరంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. గడువు దాటిన తరువాత కూడా.. క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు ఎన్నికల సిబ్బంది. మధ్యాహ్నం వరకు మందకొడిగానే సాగిన పోలింగ్.. ఆ తరువాత ఊపందుకుంది.
చివరి రెండు గంటల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సగటు ఓటింగ్ శాతం 42గా నమోదైంది. ఆ తరువాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు 65.69 శాతానికి చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. చివరి గంటలో మరో 10 నుంచి 15 శాతం మేర పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 72.36 మేర పోలింగ్ శాతం నమోదయింది. ఇప్పుడీ మార్క్‌ను దాటడం ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ గడువు పూర్తిగా ముగిసే సమయానికి ఈ సంఖ్య 75 శాతం వరకు వెళ్లొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కాగా.. తొలి రెండు గంటల్లోనే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తరువాత పోలింగ్ వేగం మందగించింది.
సాయంత్రం 5 గంటల వరకు అత్యధిక ఓటింగ్ శాతం మండ్య జిల్లా పాండవపుర తాలూకాలోని మేల్కొటే అసెంబ్లీ నియోజకవర్గంలో రికార్డయింది. ఇక్కడ 84 శాతం మేర పోలింగ్ జరిగింది. బెంగళూరు శివార్లలోని హొస్కొటె- 83.32, కుణిగల్-81.12 శాతం, శ్రీనివాసపుర-81 శాతం మేర పోలింగ్ రికార్డయింది. బెంగళూరు పరిధిలోని సీవీ రామన్ నగర్-42.1, విజయనగర-45.65, బొమ్మనహళ్లి-45.5, బీటీఎం లేఅవుట్-46.72 మేర పోలింగ్ శాతం నమోదైంది.
బెంగళూరు పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తగ్గడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎండ తీవ్రత కూడా దీనికి ఒక కారణంగా భావిస్తోన్నారు. శాండల్‌వుడ్ హీరోలు రమేష్ అరవింద్, గోల్డెన్ స్టార్ గణేష్, జగ్గేష్, అమూల్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి ఓటు వేశారు.












Click it and Unblock the Notifications