Congress manifesto: కీలక హామీలు ఇవే: మహిళలకు ఫ్రీ: యువత, ఉద్యోగులపై వరాలు
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దఫాలో పోలింగ్‌ను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. 13వ తేదీన ఓట్ల లెక్కింపును షెడ్యూల్ చేసింది. కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తేలిపోయేది ఆ రోజే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార తీవ్రతను పెంచాయి..
అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సీనియర్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే పలు జిల్లాల్లో పర్యటించారు. కేంద్రమంత్రులు ఇక్కడే మకాం వేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్ని జిల్లాల్లో పర్యటించారు. బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గె, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య.. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సారథ్యాన్ని వహిస్తోన్నారు. కొద్దిసేపటి కిందటే వారు తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కీలక హామీలను ఇందులో పొందుపరిచారు. తాము అధికారంలోకి వస్తే- అమలు చేయాల్సిన పథకాలు, కార్యక్రమాలన్నింటినీ ఇందులో వివరించారు.
యువ నిధి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడతామని తెలిపింది కాంగ్రెస్. ఈ పథకం కింద నిరుద్యోగ యువకులకు ప్రతినెలా 3,000 రూపాయలు, డిప్లొమా గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది. గృహజ్యోతి కింద గృహావసర విద్యుత్ వినియోగంలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

గృహ లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకూ ప్రతి నెలా 2,000 రూపాయల చొప్పున నగదు మొత్తాన్ని బదిలీ చేస్తామని ఈ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అలాగే- బీపీఎల్ కుటుంబంలోని ప్రతి మహిళకు 10 కేజీల బియ్యం ఉచితంగా అందిస్తామని తెలిపింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే- కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆధీనంలో నడిచే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని కల్పిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పింఛన్ వ్యవస్థను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కనీస వేతనాలు చెల్లిస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తామని, దీనికి బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందిస్తుందని స్పష్టం చేసింది. రాత్రి విధుల్లో ఉన్న పోలీసులకు ప్రతి నెలా 5,000 రూపాయల అలవెన్స్, సంవత్సరంలో ఒక నెల అదనపు వేతనం ఇస్తామని తెలిపింది.












Click it and Unblock the Notifications