ఆ ఎమ్మెల్యే బెయిల్‌ను రద్దు చేసిన హైకోర్టు- ఏ క్షణమైనా అరెస్ట్
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఏప్రిల్ మొదటివారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేస్తోన్నాయి. జిల్లాల్లో పర్యటిస్తోన్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సీనియర్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ, ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి కాంగ్రెస్-జేడీఎస్ కసరత్తు చేస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య బీజేపీ చిక్కుల్లో పడింది. సొంత పార్టీకి చెందిన శాసన సభ్యుడు మాడల్ విరూపాక్షప్ప వ్యవహారం.. అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన బెయిల్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. ముందస్తు బెయిల్ పిటీషన్‌ను కూడా జస్టిస్ నటరాజన్ సారథ్యంలోని ఏకసభ్య ధర్మాసనం కొట్టి వేసింది. దీనితో ఆయనను అరెస్ట్ చేయడానికి లోకాయుక్త పోలీసులు రంగం సిద్ధం చేశారు.

దావణగెరె జిల్లాలోని చెన్నగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మాడల్ విరూపాక్షప్ప- కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా పని చేశారు. ఆ సమయంలో ఓ కాంట్రాక్ట్ ను జారీ చేసే విషయంలో 40 లక్షల రూపాయలను లంచాన్ని డిమాండ్ చేశారు. తండ్రి తరఫున విరూపాక్షప్ప కుమారుడు మాడల్ ప్రశాంత్ ఈ మొత్తాన్ని తీసుకుంటూ లోకాయుక్త పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఈ కేసులో ఏ1గా మాడల్ విరూపాక్షప్ప అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన 48 గంటల్లో ఆయనకు బెయిల్ లభించింది.
దీన్ని సవాల్ చేస్తూ లోకాయుక్త పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తాజాగా బెయిల్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విరూపాక్షప్పకు బెయిల్ మంజూరు చేయడం పట్ల సుప్రీంకోర్టు కూడా ఆరా తీసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలను జారీ చేసిన కొద్దిసేపటికే- ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు రద్దు చేసింది.












Click it and Unblock the Notifications