ఐటీ హబ్ లో ఆస్తులు ఉన్న వాళ్లకు షాక్ ?, పన్ను ఎంత పెరుగుతోంది ?, లోక్ సభ ఎన్నికల సమయంలో !
బెంగళూరు ప్రజలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆస్తిపన్ను పెంపుపై ఆందోళనలో ఉన్న సిలికాన్ సిటీ ప్రజలకు ఇప్పుడు ఊరట లభించినట్లైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బెంగళూరులో ఆస్తిపన్ను సవరణలను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. 2016లో అవలంబించిన ఆస్తి పన్ను లెక్కింపు పద్ధతి ఇక ముందు కొనసాగుతుందని కర్ణాటక ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
గ్రేటర్ బెంగళూరు మహానగర పాలక సంస్థలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఆస్తి పన్ను రేటు పెంపుపై జోరుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. దీనిపై డీకే శివకుమార్ ట్వీట్ చేస్తూ గ్రేటర్ బెంగళూరు మహానగర కార్పొరేషన్‌లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆస్తిపన్ను పెంచనున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని, బీబీఎంపీ ఎలాంటి ఆస్తిపన్ను పెంచలేదని డీకే శివకుమార్ తెలిపారు.
ప్రస్తుత ఆస్తిపన్ను రేట్లు అమలులో ఉంటాయని, 2016లో సూచించిన ఆస్తి పన్ను రేటు అలాగే కొనసాగుతాయని, బెంగళూరు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీకే శివకుమార్ తెలిపారు. దీనిపై బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ కూడా స్పందించారు. బెంగళూరు మహానగర పాలకె సంస్థలో ఆస్తిపన్ను రేట్ల పెంపుపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బెంగళూరు సిటీ పోలీసులను కోరామని ఆయన అన్నారు.
బెంగళూరు ఆస్తి పన్ను విషయంలో తప్పుడు సమాచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీబీఎంపీ కమీషనర్ హెచ్చరించారు. ఫేక్ న్యూస్ అప్‌లోడ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలకు కూడా డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో భారీగా ఆస్తి పన్ను పెంపుదల ఉంటుందని ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వీడియోను రిలీజ్ చేశాడు. అద్దె ఇళ్లపై ఆస్తిపన్ను రెండింతలు, వాణిజ్య సంస్థలపై పన్ను 3 శాతం నుంచి పెంపు 5 శాతం పెంపు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

దీంతో ఈ వార్త సర్వత్రా వ్యాపించడంతో బెంగళూరు వాసులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, బీబీఎంపీ క్లారిటీ ఇచ్చింది. ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బీబీఎంపీ అందించే 5% రాయితీ ఇంతకుముందు ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు అంటే ఏప్రిల్, మే నెలలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు ఈ గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించినట్లు సమాచారం. మొత్తం మీద బెంగళూరులో ఆస్తి పన్ను పెరగడం లేదని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ క్లారిటీ ఇవ్వడంతో ప్రజలు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications