కాంగ్రెస్‌కు బిగ్ బూస్ట్: 215 సీట్లల్లో మద్దతు
బెంగళూరు: పోలింగ్ తేదీ సమీపిస్తోన్న కొద్దీ కర్ణాటకలో అసెంబ్లీ ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఏ పార్టీ అనేది ఆ రోజున తేలిపోతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.
అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ కసరత్తు చేస్తోన్నప్పటికీ- వరుసగా సీనియర్ నాయకులు రాజీనామా చేస్తోండటం ఆ పార్టీకి మింగుడుపడట్లేదు. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవాది సహా ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుడ్‌బై చెప్పారు.

వారంతా కాంగ్రెస్, జేడీఎస్‌లల్లో జాయిన్ అయ్యారు. తాజాగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ.. కర్ణాటకలో పర్యటిస్తోన్నారు. ఈ ఉదయమే ఆయన కర్ణాటకలో అడుగుపెట్టారు. బాగల్‌కోటె జిల్లా కూడల సంగమలోని సంగమనాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సాయంత్రం ఆయన విజయపురలో రోడ్ షోలో పాల్గొననున్నారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ బూస్ట్ లభించింది. సీపీఐ కర్ణాటక రాష్ట్రశాఖ కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 224 అసెంబ్లీ స్థానాల్లో 215 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు తాము మద్దతు ఇస్తోన్నట్లు సీపీఐ కర్ణాటక కార్యదర్శి సౌతి సుందరేశ్ తెలిపారు. మేల్కొటే నియోజకవర్గంలో సర్వోదయ కర్ణాటక పార్టీ, బాగేపల్లిలో సీపీఎం అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నట్లు చెప్పారు.

మిగిలిన ఏడు చోట్ల అంటే- ముడిగెరె, అలంద్, జీవర్గీ, కుడ్లగి, కేజీఎఫ్, సిరా, మడికెరి నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపామని సౌతి సుందరేష్ వివరించారు. ఇది కాంగ్రెస్‌తో స్నేహపూరక పోటీగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమకు ఉన్న క్యాడర్ మొత్తం సంపూర్ణగా కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ వంటి కార్పొరేట్ శక్తులను అడ్డుకోవడానికే కాంగ్రెస్‌తో చేతులు కలపాల్సి వచ్చిందని సౌతి సుందరేష్ చెప్పారు. బీజేపీ పాలనలో దేశం మొత్తం అవినీతిమయమైందని, అంబానీ-అదానీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సంపదను దోచిపెడుతున్నాడంటూ ధ్వజమెత్తారు. కర్ణాటకతో- దేశవ్యాప్తంగా బీజేపీ పతనానికి బీజం పడుతుందని ఆయన అన్నారు. కార్పొరేట్ శక్తులను తరిమి కొట్టాలంటూ ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications