Karnataka: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పల్లీపట్టీల పంపిణీ నిలిపివేత
Karnataka: కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇకనుంచి పల్లీపట్టీల పంపిణీని నిలిపివేసింది. దీని ప్రభావం పిల్లల ఆరోగ్యంపై ఉంటుందనే ఆందోళన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పల్లీ పట్టీలలో అధిక అసంతృప్తి కొవ్వు, అధిక చక్కెర కంటెంట్ ఉండడం వల్ల పిల్లల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం చూపుతుందని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్(పాఠశాల విద్య) నివేదిక నేపథ్యంలో కర్ణాటక సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పిల్లల ఆరోగ్యంపై పల్లీ పట్టీలు దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గడువు తీరిన, సరిగా నిల్వ చేయని పల్లీ పట్టీలను పంపిణీ చేయడం వంటి కేసుల గురించి ఈ నివేదిక ఆందోళనలను లేవనెత్తింది.
మధ్యాహ్న భోజన పథకం కింద పల్లి పట్టీకి బదులుగా గుడ్లు లేదా అరటి పండ్లు అందించాలని అధికారులు పాఠశాలలను ఆదేశించారు. 2021 నుంచి మధ్యాహ్నం భోజన పథకంలో గుడ్డుకు ప్రత్యామ్నాయంగా విద్యార్థులకు అరటి పండ్లు లేదా బెల్లం-వేరుశనగతో కూడిన పల్లిపట్టీని అందించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 2021 చివరిలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కావడానికి ముందే పల్లీపట్టీల శాంపిల్స్ ను అందించాలని కర్ణాటక ప్రభుత్వం మిల్క్ ఫెడరేషన్ ను కోరింది. మరోవైపు, డిసెంబర్ 2022లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ అందించిన డేటా ప్రకారం 2.27 లక్షల మంది పిల్లలు మాత్రమే పల్లీపట్టీని ఇష్టపడుతున్నారు. దాదాపు 80 శాతం మంది విద్యార్థులు తమ మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఉండాలని ఎంచుకున్నారు. పల్లీపట్టీలను పరిపూరక ఆహారంగా ప్రవేశపెట్టిన సంవత్సరం తర్వాత.. 1 నుంచి 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నుంచి ఈ డేటాను సేకరించారు.













Click it and Unblock the Notifications