పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెంపు: లీటర్‌పై రూ.3కు పైనే వాత
Petrol and Diesel price: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇంధన రేట్లను భారీగా పెంచింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అతి కొద్దిరోజుల్లోనే సిద్ధరామయ్య సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమౌతోంది.
ప్రస్తుతం కర్ణాటకలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ. 99.84 పైసలు, డీజిల్ రూ. 85.93 పైసలు పలుకుతోంది. గతంలో పెట్రోల్ 101 రూపాయలు, డీజిల్ 87 రూపాయల వరకు ఉండగా.. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీటర్‌పై రెండు రూపాయల మేర సడలింపు ఇచ్చారు. ఫలితంగా 100 రూపాయల కంటే తక్కువకు చేరింది పెట్రోల్ ధర.

తాజాగా కర్ణాటక ప్రభుత్వం దీన్ని మళ్లీ పెంచింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వసూలు చేస్తోన్న సేల్స్ ట్యాక్స్‌ను భారీగా పెంచింది. ప్రస్తుతం లీటర్‌పై 18.44 శాతం అమ్మకం పన్నును వసూలు అవుతోండగా.. దీన్ని 29.84 శాతానికి పెంచింది. 11 శాతం మేర అమ్మకం పన్నును పెంచినట్టయింది.
ఈ మేరకు కర్ణాటక ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి నితీష్ కే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై అమ్మకం పన్నును 11 శాతం వరకు పెంచడం వల్ల లీటర్ ఒక్కింటికి 3 రూపాయల నుంచి రూ.3.05 పైసల వరకు ఇంధన రేట్లు పెరగబోతోన్నాయి. ఈ పెంపుదల తక్షణమే అమలులోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో- బెంగళూరులో అనేక చోట్ల మధ్యాహ్నం నుంచే పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. రేట్లు పెరిగిన తరువాత విక్రయించాలనే ఉద్దేశంతోనే బంకులను మూసివేసినట్లు చెబుతున్నారు. అధికారికంగా ఉత్తర్వులు వెలువడిన తరువాత వాటిని కర్ణాటక పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెరుస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications