డీకే శివకుమార్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు, పిటిషన్ విచారణ పై బెంచ్ కు బదిలి, డీసీఎం ?
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. డీకే శివకుమార్ పై సీబీఐ దర్యాప్తుకు అనుమతిని ఉపసంహరించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ సీబీఐ మళ్లీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. దీంతోపాటు బీజేపీ నేత బసనగౌడ పాటిల్ యత్నాల్ దాఖలు చేసిన పిటిషన్, సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ రెండింటినీ కర్ణాటక హైకోర్టు విచారించింది.
సీబీఐ పిటిషన్ విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనానికి పంపాలని సిఫారసు చేసింది. పిటీషన్ విచారణ చేసిన బెంచ్ శిఫార్సు ఇపుడు అదనపు బెంచ్ కు చేరింది. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం బెంచ్ మళ్లీ పరిశీలిస్తే డీకే శివకుమార్ కు మరింత ఇబ్బందిగా మారనుందని న్యాయనిపుణులు అంటున్నారు.

సీబీఐ, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది. కేసు తుది దశ విచారణ జరుగుతున్న నేపథ్యంలో పిటిషన్ విచారణకు అత్యున్నత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేశారు. అంతేకాకుండా ప్రతివాదులైన కర్ణాటక లోకాయుక్తకు, కర్ణాటక ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అదే సమయంలో కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు లోకాయుక్త పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణలో సీబీఐ న్యాయవాది హాజరు అయ్యారు. డీకే శివకుమార్ కు చెందిన కేసు సీబీఐ విచారణ చేపట్టిందని, ఇందుకు అప్పటి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందని, ఇప్పుడు సీబీఐకి ఇచ్చిన అనుమతిని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అనుమతిని వెనక్కి తీసుకుని కేసును కర్ణాటక లోకాయుక్తకు అప్పగించింది.

అందువలన కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఉత్తర్వులను రద్దు చేయాలని సీబీఐ కోరింది. లోకాయుక్తలో కేడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అందుకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకోవాలని సీబీఐ న్యాయవాది కోరారు. అలాగే సీబీఐ చేస్తున్న దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతించాలని ధర్మాసనానికి న్యాయవాది తెలిపారు. అదే సమయంలో బసవనగౌడ పాటిల్ యత్నాల్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు.
ఒక వ్యక్తిపై కేసును క్యాబినెట్ ఉపసంహరించుకోవడంతో మూడవ వ్యక్తి జోక్యం చేసుకోవడానికి అనుమతించిన సుప్రీంకోర్టులోని అనేక కేసులను ఉదహరించారు. అందువల్ల వాదనను పరిగణనలోకి తీసుకోవాలని యత్నాల్ తరపు న్యాయవాదులు కోరారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్ విచారణను అత్యుతన్నత ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2019లో డీకే శివకుమార్‌పై మనీలాండరింగ్ కేసును నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తు చేసేందుకు అప్పటి కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అనుమతించింది. దీనిని ప్రశ్నిస్తూ డీకే శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏకసభ్య ధర్మాపనం కొట్టివేసింది. దీనిని ప్రశ్నిస్తూ డీకే శివకుమార్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేశారు. ఈలోగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ఏడాది నవంబర్ 28వ తేదీ డీకే శివకుమార్ మీద నమోదు అయిన సీబీఐ విచారణకు ఇచ్చిన అనుమతిని సిద్దరామయ్య ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో డివిజన్ బెంచ్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవడాన్ని ప్రశ్నిస్తూ బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సీబీఐ కూడా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈ రెండు పిటిషన్లు విచారణలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications