హైకమాండ్ టాస్క్, మంత్రి పదవులు కావాలా ?, లేకుంటే కుర్చీలు మడతపెట్టాలా ?, రేయ్ సాంబా రాస్కో !
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న సమయంలో ముఖ్యమంత్రి కుర్చీ చర్చ తెరపైకి వచ్చింది. ఢిల్లీలో ఇప్పటి అన్నీ ఖరారయ్యాయని కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీకే శివకుమార్ ఇటీవల మీడియాకు చెప్పడం కలకలం రేపింది. హైకమాండ్ అంగీకరిస్తే తానే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి సమయంలో కర్ణాటక మంత్రి శరణబసప్ప దర్శనాపుర సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది. తమ ప్రాంతంలో ఎంపీ అభ్యర్థులను గెలిపించడానికి పని చెయ్యకపోతే తాము మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని పరోక్షంగా సూచించారు.లోక్‌సభ ఎన్నికల తర్వాత మంత్రి కుర్చీపై కన్ను వేస్తారని, ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోలేని మంత్రులు వారి పదవులకు రాజీనామా చెయ్యాల్సి వస్తుందని మంత్రి శరణబసప్ప వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది.

తమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యంగా ఓట్లు పడకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అన్న మీడియా ప్రశ్నకు మంత్రి శరణబసప్ప ఇలా మాట్లాడటంతో కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. యాదగిరి జిల్లా సూర్పూర్ తాలూకా కెంబావిలో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన చిన్న పరిశ్రమల శాఖా మంత్రి, యాదగిరి జిల్లా ఇంచార్జి మంత్రి శరణబసప్ప దర్శనాపుర ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆధిక్యం ఇవ్వకుంటే మా కుర్చీ(మంత్రి)ని వదిలేయాల్సి వస్తుందని అన్నారు.
ఇక్కడ మన పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకోలేకపోతే ఏ ముఖం పెట్టుకుని సీఎం దగ్గరకు వెళ్లాలి, నిజం చెప్పాలంటే నాకు మంత్రి పదవి ఇచ్చి ఉండాల్సింది కాదు. ఎందుకంటే గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 20 వేల ఆధిక్యంలో ఇక్కడ గెలిచిందని, తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిచానని మంత్రి శరణబసప్ప తెలిపారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం రాకపోతే చాలా కష్టం అవుతుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రాజా వేణుగోపాల్ కుమార్ ను గెలిపించాలని మంత్రి శరణబసప్ప ఓటర్లకు మనవి చేశారు.

ఏప్రిల్ 26వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని 14 నియోజకవర్గాలకు తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 14 లోక్ సభ నియోజక వర్గాలకు మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 28వ తేదీన ప్రారంభం అయ్యింది.తొలి దశలో ఉడిపి-చిక్కమగళూరు, హాసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుమకూరు, మాండ్య, మైసూర్-కొడగు, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్, చిక్కబల్లాపురం, కోలార్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
రెండో దశలో చిక్కోడి, బెళగావి, బాగల్‌కోట్, విజయపూర్, కలబురగి, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారి, హావేరి, ధారవాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాలకు మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది.రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభం అయ్యింది. ఏప్రిల్ 19వ తేదీ నామినేషన్ పత్రాల సమర్పణకు చివరి తేదీ. ఏప్రిల్ 20వ తేదీ నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు ఏప్రిల్ 22వ తేదీ చివరి రోజు. మే 7వ తేదీన ఓటింగ్ నిర్వహించి జూన్ 4 వతేదీన లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications