జేపీ నడ్డా, అమిత్ మాలవీయకు బెంగళూరు పోలీసులు సమన్లు: ఎందుకంటే?
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాలవీయకు కర్ణాటక పోలీసులు సమన్లు జారీ చేశారు. మరోవైపు, బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ సమన్లలో భాగంగా హాజరయ్యేందుకు వారికి అధికారులు వారం రోజుల గడువు ఇచ్చారు.
కాగా, ముస్లిం ఓటు బ్యాంక్ కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బడుగువర్గాల రిజర్వేషన్లు గుంజుకునేలా రాజ్యాంగాన్ని మార్చాలన్నది కాంగ్రెస్, దాని మిత్రపక్షాల (ఇండియా కూటమి) విధానమని ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆ మాటలు ప్రతిబింబించేలా ఓ వీడియోను బీజేపీ కర్ణాటక యూనిట్ ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేసింది.

దీంతో ఆ వీడియోపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతూ ఖండించింది. మరోవైపు, ఆ పోస్టును వెంటనే తొలగించాలని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు ఇచ్చారు. దాన్ని తొలగించాలని మంగళవారం ఎక్స్‌కు నోటీసులు కూడా జారీ చేశారు. కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలో అనేక మంది ముస్లింలను అక్రమంగా ఓబీసీ జాబితాలో చేర్చిందని అన్నారు.
దేశ వనరులు మొదట ముస్లింలకే చెందుతాయని కాంగ్రెస్ ప్రకటిస్తుంటే.. వాటిపై పేద ప్రజలకే మొదటి హక్కు ఉందని తాను చెబుతున్నానని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. మతపరంగా ఎటువంటి వివక్ష లేకుండా 80 కోట్ల మందికి బీజేపీ ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందించిందని చెప్పారు.
ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటూ.. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను పేరుతో ప్రజల నుంచి సగానికిపైగా ఆస్తిని దోచుకుంటుందన్నారు. బీజేపీ నేతల విమర్శలకు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది.












Click it and Unblock the Notifications