కర్ణాటకలో 17 రోజుల్లో 6,790 మంది మృతి: ఒక్క బెంగళూరులోనే 10 వేలమంది: మరణాల్లో రెండోస్థానం
బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోన్న వేళ.. కర్ణాటకలో మాత్రం అదుపులోకి రావట్లేదు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభమైన తరువాత అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలను నమోదు చేస్తూ వచ్చిన మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లల్లో వాటి తీవ్రత తగ్గుతోండగా.. కర్ణాటకలో పరిస్థితుల్లో పెద్దగా మార్పులేమీ కనిపించట్లేదు. లాక్‌డౌన్ విధించినప్పటికీ- రోజువారీ కేసుల్లో గానీ, మరణాల్లో గానీ ఆశించిన స్థాయిలో తగ్గకపోవడం ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నెల 24వ తేదీన సంపూర్ణ లాక్‌డౌన్ ముగియాల్సి ఉండగా.. దీన్ని వచ్చేనెల మొదటి వారం వరకూ పొడిగించే అవకాశాలు లేకపోలేదు.
మే నెల కర్ణాటక పాలిట డెడ్లియెస్ట్ మంత్‌గా మారింది. ఈ నెల 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 6,790 మంది కరోనా వైరస్ పేషెంట్లు మృత్యువాత పడ్డారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు సహా అన్ని జిల్లాల్లోనూ మరణాల రేటు అధికంగా ఉంటోంది. కరోనా వల్ల మరణించిన వారికి అంత్యక్రియలను నిర్వహించడానిక్కూడా చోటు దక్కని దుర్భర పరిస్థితుల్లో ఉద్యాననగరిలో నెలకొన్నాయి. ఇప్పటిదాకా ఒక్క బెంగళూరులోనే కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 10,021కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 298 మంది కరోనా పేషెంట్లు ప్రాణాలను కోల్పోయారు.

దీనితో కర్ణాటక వ్యాప్తంగా కరోనా వల్ల మృత్యువాత పడిన వారి సంఖ్య 22,313కు చేరింది. దేశంలోో కరోనా మరణాలు అత్యధికంగా చోటు చేసుకున్న రెండో రాష్ట్రంగా నిలిచింది కర్ణాటక. ఇదివరకు ఢిల్లీ ఈ స్థానంలో ఉండేది. ఢిల్లలో ఇప్పటిదాకా 21,846 మంది మరణించారు. వారం రోజులుగా కర్ణాటకలో మరణాల సంఖ్య కనివినీ ఎరుగని విధంగా నమోదవుతోంది. ఈ నెల 7 నుంచి 13వ తేదీ మధ్య 5,189 మంది మృతిచెందగా.. 14 నుంచి 17వ తేదీ మధ్యలో 1,601 చనిపోయారు. రోజూ సగటున 400 మంది వరకు చనిపోతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తోన్నాయి.
ఇందులో బెంగళూరు వాటా అధికం. మైసూరు-1,410, బళ్లారి-1,090, దక్షిణ కన్నడ-819, ధార్వాడ-803ల్లో మరణాలు రేటు అధికంగా నమోదవుతోంది. గదగ్, యాద్గిర్, కొడగు, చిత్రదుర్గల్లో సగటున వందకు పైగా మరణాలు చోటు చేసుకుంటోన్నాయి. కరోనా మరణాలు అత్యదికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర టాప్‌లో కొనసాగుతోంది. 82 వేల మందికి పైగా అక్కడ మృతి చెందారు. ఏప్రిల్‌లో మరణాల సంఖ్య పరిమితంగా ఉన్నప్పటికీ.. మే ప్రారంభమైన తరువాత వాటి సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ.. వాటి తీవ్రత తగ్గట్లేదు.












Click it and Unblock the Notifications