సెక్స్ స్కాండల్ కేసు, మాజీ ప్రధాని కొడుకు అరెస్టు, కొడుకు చేసిన తప్పుకు దళపతి ఇంట్లోకి ఎంట్రీ !
దేశంలోనే కలకలం రేపిన హాసన్ లైంగిక వేధింపుల కేసు ఎట్టకేలకు సిట్ అధికారులు ముందడుగు వేశారు. సొంత కుమారుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, హలేనరసీపుర జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను కర్ణాటక సిట్ అధికారులు కస్టడీలోకి తీసుని విచారణ చేస్తున్నారు. మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ కుమారుడే ఈ హెచ్ డీ రేవణ్ణ.
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోవడంతో అదే సెక్స్ స్కాండల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తండ్రి హెచ్ డీ రేవణ్ణను సిట్ అధికారులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. లైంగిక వేధింపుల కేసులో హెచ్‌డీ రేవణ్ణకు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక కోర్టు శనివారం ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బెయిల్ రాకపోవడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణను అరెస్టు చేశారు.

బెంగళూరులోని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ నివాసంలో ఆయన కుమారుడు, మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ ఉన్నారని సిట్ అధికారులు గుర్తించారు. మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ ఇంటిలోనే మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణను అదుపులోకి తీసుకున్న అధికారులు అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి తరలించారు. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన లైంగిక వేధింపుల వీడియోలలో ఉన్న చాలా మంది మహిళల్లో ఒకరైన తన తల్లిని కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ 20 ఏళ్ల యువకుడు మైసూర్‌లోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణపై కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో సిట్ అధికారులు ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా హలేనరసీపుర జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం సోదాలు నిర్వహించారు.
ఆ సమయంలో ఎమ్మెల్యే హెచ్ డీ రేవణ్ణ మద్దతుదారులు ఆయన నివాసంలోకి దూసుకుపోయి సిట్ అధికారులకు అడ్డుపడటంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై శనివారం సిట్ అధికారులు రెండో సారి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. దీనికి తోడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కేంద్ర దర్యాప్తు శాఖ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసే అవకాశం ఉందని కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారి ఒకరు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమాచారం అందించారని తెలిసింది
కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, ఆయన సహచరులు తన తల్లిని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ 20 ఏళ్ల యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుణసూరులో ఆ మహిళ ఆచూకీ లభించిందని, ప్రస్తుతం ఆ మహిళ నుంచి సమాచారం సేకరిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. మహిళ కిడ్నాప్ కేసులో నిందితుడు సతీష్ బాబు అలియాస్ సతీష్ బాబన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచి న్యాయస్థానం అనుమతితో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మొత్తం మీద సెక్స్ స్కాండల్ కేసులో మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ కుమారుడు హెచ్ డీ రేవణ్ణను సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం కర్ణాటకలో కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications