BJP-JDS: కర్నాటకలో పొత్తు పొడిచింది..!
బెంగళూరు: కర్నాటకలో పొత్తు రాజకీయం ప్రారంభమైంది. నిన్న మొన్నటి దాక కస్సు బుస్సులాడుకున్న రెండు పార్టీలు త్వరలో పొత్తు పెట్టుకోనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు జేడీఎస్ బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే చర్చలు కూడా దాదాపుగా ముగిసినట్లు సమాచారం.
కొన్ని నెలల క్రితం జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీజేపీ జేడీఎస్‌లు ఒక్కటి కాబోతున్నాయి. గతంలో కుమార స్వామి సీఎం పీటం ఎక్కగానే ఓర్వలేకపోయిన బీజేపీ తన రాజకీయం మొదలు పెట్టింది. చివరకు కుమారస్వామి దిగిపోయేందుకు కారణమైంది. దీంతో ఆ ప్రభుత్వం కూలి కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. తాజాగా కాంగ్రెస్‌కు కామన్ శతృవులుగా ఉన్న బీజేపీ జేడీఎస్‌లు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చేశాయి.

జేడీఎస్ బీజేపీల అగ్రనేతలు ఈ మేరకు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని కర్నాటక మాజీ సీఎం బీజేపీ నేత యడియూరప్ప స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి పొత్తుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు అనేదానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
అయితే యడియూరప్ప చెప్పిన ప్రకారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా జేడీఎస్‌కు నాలుగు సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.అయితే జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ మాత్రం ఐదు సీట్లు పట్టుబట్టినట్లు సమాచారం. మాండ్య, హసన్, తూమకూరు, చిక్‌బళ్లాపూర్, బెంగళూరు రూరల్ స్థానాలను దేవెగౌడ అడిగారు. అంతకుముందు పార్టీ అగ్రనేతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాతే పొత్తు ప్రతిపాదనను దేవెగౌడ బీజేపీ ముందు ఉంచినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని దేవెగౌడ చెప్పిన నెలరోజులకే బీజేపీ ముందు పొత్త ప్రతిపాదన తీసుకురావడం చర్చనీయాంశమైంది. కర్నాటకలో 28 లోక్‌సభ స్థానాలున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ జేడీఎస్‌లకు చెరో సీటు దక్కింది. జేడీఎస్ కంచుకోట అయిన హసన్‌లో దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించారు.
మొత్తానికి రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరని కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయనేది జేడీఎస్ బీజేపీ పొత్త ఎపిసోడ్‌తో మరోసారి తేటతెల్లమైంది.












Click it and Unblock the Notifications