వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక: హిజాబ్ తర్వాత హలాల్ మాంసంపై వివాదం ఎందుకు రాజుకుంటోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
హలాల్

కర్నాటకలో మరో వివాదం రాజుకుంటోంది. కన్నడ కొత్త సంవత్సరమైన ఉగాదినాడు ''హలాల్’’ మాంసం తినొద్దని ప్రజలను హిందూ సంస్థలు అభ్యర్థిస్తున్నాయి.

వారం రోజుల క్రితం వరకు కర్నాటకలో హిజాబ్ వివాదం పతాక శీర్షికల్లో నిలిచింది. సోషల్ మీడియా నుంచి పత్రికల వరకు అన్నిచోట్లా హిజాబ్‌పై కథనాలు వచ్చాయి. టీవీల్లో దీనిపై చర్చలు కూడా జరిగాయి.

ఈ విషయంలో కర్నాటక హైకోర్టు తీర్పు వెల్లడించింది. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని హైకోర్టు చెప్పింది. దీనిపై నిరసన వ్యక్తంచేస్తూ కొందరు ముస్లింలు తమ దుకాణాలను కూడా మూసివేశారు.

ఆ తర్వాత దేవాలయాల వెలుపల వ్యాపారాలు నిర్వహించే ముస్లింలపైనా నిషేధం విధించాలనే డిమాండ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ముస్లింలు విక్రయించే హలాల్ మాంసంపై వివాదం రాజుకుంది.

హలాల్

హిందూ జన జాగృతి సమితి అభ్యర్థన

దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త సంవత్సరంనాడు మాంసంతో వేడుక చేసుకునే సంప్రదాయం ఉంది. దీన్ని ''హోసాతొడకు’’ లేదా ''వర్షదా తొడకు’’ అని పిలుస్తుంటారు. కొత్త సంవత్సరం ప్రారంభం అని దీని అర్థం.

''కొత్త సంవత్సరంనాడు హలాల్ మాంసం తినొద్దని మేం హిందువులను అభ్యర్థిస్తున్నాం’’అని హిందూ జన జాగృతి సమితి అధికార ప్రతినిధి మోహన్ గౌడ్ బీబీసీతో చెప్పారు. హలాల్ మాంసాన్ని ఇస్లామిక్ పద్ధతులను అనుసరించి సిద్ధం చేస్తారని ఆయన వివరించారు.

''అల్లా పేరును జపిస్తూ వారు జంతువులను బలి ఇస్తారు. ఆ సమయంలో ఖురాన్‌ కూడా పఠిస్తారు. అంటే ఆ మాంసాన్ని వారు అల్లాకు సమర్పిస్తున్నారు. దాన్ని హిందూ దేవతలకు పెట్టకూడదు. అలా చేయడం హిందూ ధర్మానికి వ్యతిరేకం’’అని ఆయన అన్నారు.

ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి కూడా బీబీసీతో మాట్లాడారు.

''వారు భారతదేశం లౌకిక దేశం అంటారు. అలాంటప్పుడు మాంసం మాత్రం హలాల్ అని ఎందుకు పిలవడం. హలాల్‌ను మనం ప్రోత్సహించకూడదు. హలాల్ అనేది ఎకనమిక్ జిహాద్ కిందకు వస్తుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

''నాకు హలాల్ మాంసమే కావాలని ముస్లిం అడిగినప్పుడు.. నాకు హలాల్ ఎందుకు ఇస్తున్నారని హిందువులు కూడా అడగొచ్చు. అందులో తప్పేముంది?’’అని ఆయన ప్రశ్నించారు.

జన జాగృతి సమితి డిమాండ్ తర్వాత కొన్ని సంఘ్ పరివార్ సంస్థలు ఈ విషయంపై కరపత్రాలు కూడా పంచుతున్నాయి. తమ షాపుల్లో హలాల్ మాంసం పేరుతో పెట్టిన బోర్డులను తొలగించాలని హిందూ దుకాణాల యజమానులను వారు కోరుతున్నారు.

ఇంతకీ హలాల్ అంటే ఏమిటి?

ఈ విషయంపై బెంగళూరులోని జుమ్మా మసీదుకు చెందిన మౌలానా మఖ్సూద్ ఇమ్రాన్ రష్దీ బీబీసీతో మాట్లాడారు.

''మొదట జంతువుల మెడ దగ్గర నరాన్ని కోసి రక్తం బయటకు వచ్చేలా చూస్తారు. ఆ రక్తం జంతువు శరీరంలోనే ఉండిపోతే, దాన్ని తినడంతో మనకు జబ్బులు వస్తాయని మహమ్మద్ ప్రవక్త చెప్పారు. రక్తం మొత్తం బయటకు వెళ్లిపోతే, ఆ మాంసాన్ని తిన్న తర్వాత మనకు ఏమీ కాదు. ఈ పద్ధతిని జబీహా అని పిలుస్తారు’’అని ఇమ్రాన్ చెప్పారు.

''హలాల్ కోసం మొదట జంతువును నేలపై పడుకోబెడతారు. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెబుతూ జబీహా చేస్తారు. తల నుంచి శరీరం వేరుకాకుండా జాగ్రత్త పడుతూ మెడ దగ్గర కోస్తారు. అలా రక్తాన్ని బయటకు తీసేస్తారు’’అని ఆయన వివరించారు.

ఝాట్కా పద్ధతి రెండోది. ఈ విధానంలో జంతువు తల, మొండాన్ని వేరు చేస్తారు.

హలాల్

''ముస్లింలపై కాదు.. హలాల్ పైనే మా వ్యతిరేకత’’

''మా ప్రచారం ముస్లింలపై కాదు.. కేవలం హలాల్ పైనే. హలాల్ అనేది రాజ్యాంగ వ్యతిరేకం’’అని హిందూ జన జాగృతి సమితి అధికార ప్రతినిధి మోహన్ గౌడ వ్యాఖ్యానించారు.

అయితే, హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)కు చెందిన డాక్టర్ వీణ శత్రుఘ్న ఈ విషయంలో భిన్నంగా స్పందించారు.

''హలాల్ మాంసం చాలా సురక్షితమైనది. మిగతా విధానాల కంటే ఇది మంచిది. మనం ఈ విధానాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఇలా మాంసాన్ని కోస్తే, ఆహారపు సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది’’అని ఆమె అన్నారు.

బీజేపీపై వ్యతిరేకత

హలాల్‌పై హిందూ సంస్థల ప్రచారం మొదలవ్వడంతోనే ఆలయాల దగ్గర ముస్లిం దుకాణాలను కూడా మూసివేయాలనే ప్రచారం ఊపందుకుంది.

బీజేపీలోనే కొంత మంది నాయకులు ఇలాంటి ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాంటి వారిలో కర్నాటక ఎమ్మెల్యే కూడా ఉన్నారు.

''మాంసం కొనేవారు ఇది హలాలా కాదా అని అడగరు. ఏం తినాలి అనేది వారి ఇష్టం. ఏం తినాలో ఎంచుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉంది. ఇది తినాలి, ఇది తినొద్దు అని ఎవరూ చెప్పకూడదు’’అని బీజేపీ ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ అన్నారు.

ఆలయాల దగ్గర ముస్లింల దుకాణాలను మూసివేయాలనే వాదనను ఆయన ఖండించారు.

''ఇది ఒకరకమైన సామాజిక సమస్యలా మారుతోంది. ఇదొక అమానవీయ చర్య. ఇలాంటి వాటిని మనం అసలు ప్రోత్సహించకూడదు’’అని ఆయన అన్నారు.

మరోవైపు ఒక మతానికి చెందిన వ్యక్తి నుంచి వస్తువులు కొనాలని మనం ప్రజలపై ఒత్తిడి చేయలేమని బీజేపీ ఎమ్మెల్యే, లాయర్ అనిల్ బెంకే కూడా వ్యాఖ్యానించారు.

వీరి వాదనతో రాష్ట్ర న్యాయ శాఖ జేసీ మధుస్వామి విభేదించారు. దేవాలయాల దగ్గర హిందుయేతరలకు దుకాణాలు ఇవ్వడాన్ని అడ్డుకునేందుకు కర్నాటక ఎండోమెంట్ యాక్ట్‌లో నిబంధనలు ఉన్నాయని ఆయన అన్నారు. మధుస్వామి వ్యాఖ్యలపై రాష్ట్ర అసెంబ్లీలో నిరసన వ్యక్తమైంది.

బొమ్మై ప్రభుత్వంపై విమర్శలు

మతపరంగా ఎలాంటి వివక్షా చూపకూడదని ఇదివరకు సుప్రీం కోర్టు కూడా నొక్కి చెప్పిందని పీయూసీఎల్ కర్నాటక విభాగం అధిపతి అరవింద్ నారాయన్ బీబీసీతో చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కొన్ని సంస్థల చేతులో కీలుబొమ్మగా మారారని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు.

''ఉత్తర్‌ప్రదేశ్‌లో తీసుకొచ్చిన విధానాలే కర్నాటకలోనూ వారు అమలు చేయాలని చూస్తున్నారు. అలాంటివి ఇక్కడ పనిచేయవు’’అని ఆయన అన్నారు.

దేవాలయాల దగ్గర ముస్లింల దుకాణాల అంశాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని బొమ్మై అన్నారు.

''అది ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. దీనిపై ప్రస్తుతం అభ్యంతరాలు వస్తున్నాయి. వాటిని పరిశీలిస్తున్నాం’’అని ఆయన అన్నారు.

''హలాల్ మాంసానికి వ్యతిరేకంగా వారు ప్రచారం చేపట్టాలని అనుకుంటే, మొదట మాంసం ఎగుమతులను నిలిపివేయాలి. 2015లో మోదీ పింక్ విప్లవం గురించి మాట్లాడారు. ఆ తర్వాత దేశంలో మాంసం ఎగుమతులు రెట్టింపయ్యాయి. ఆగ్రా, ఘాజియాబాద్‌ల నుంచి మాంసం ఎగుమతులు జరగకుండా అడ్డుకోవాలని నేను బీజేపీకి సవాల్ విసురుతున్నాను’’అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి బ్రిజేశ్ కలప్ప వ్యాఖ్యానించారు.

2019-20లో భారత్ నుంచి హలాల్ మాంసం ఎగుమతులు 14.4 బిలియన్ డాలర్లకు(రూ.1,09,420 కోట్లు) పెరిగాయి. ఈ ఎగుమతుల్లో బ్రెజిల్ తర్వాత స్థానం భారత్‌దే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Karnataka: Why the controversy over halal meat after hijab
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X