• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కర్తార్‌పూర్ కారిడార్: దేశ విభజన సమయంలో ఒకరు భారత్‌లో మరొకరు పాకిస్తాన్‌లో ఉండిపోయిన అన్నదమ్ములు 75 ఏళ్ల తరువాత ఎలా కలిశారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సిద్దిఖీ, హబీబ్

''ఇమ్రాన్ ఖాన్‌తో చెప్పి నాకు వీసా ఇప్పించు. ఇండియాలో నాకు ఎవరూ లేరు.’’

''నువ్వు పాకిస్తాన్‌కు రా. నీకు నేను పెళ్లి చేయిస్తా.’’

ఇద్దరు అన్నదమ్ముల మధ్య సంభాషణ ఇది. స్వాతంత్ర్యానికి ముందు విడిపోయిన ఆ సహోదరులిద్దరూ.. ఇన్నేళ్లకు ఇప్పుడు మళ్లీ కలిశారు.

మొహమ్మద్ సిద్దిక్, మొహమ్మద్ హబీబ్‌ల ఈ అపూర్వ కలయిక.. ఇలాంటి లక్షలాది మంది కళ్లలో కనిపించే ఓ కల. వారికి.. స్వాతంత్ర్యంతో పాటు జరిగిన విభజన కేవలం ఒక చారిత్రక కథ కాదు. అది వారి గుండెలు పిండే వ్యథ.

దేశ విభజన సమయంలో ఈ అన్నదమ్ములు విడిపోయారు. ఆనాటి కల్లోలంలో వీరి కుటుంబం జలంధర్ నుంచి పాకిస్తాన్ బయలుదేరింది. వారి తండ్రి చనిపోయాడు. సిద్దిక్ తన సోదరితో కలిసి పాకిస్తాన్ చేరుకున్నాడు. హబీబ్ తన తల్లితో కలిసి ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత తల్లి కూడా చనిపోయింది.

అదంతా ఎలా జరిగిందో వారికి ఇప్పుడు అంతగా గుర్తులేదు. కానీ 75 ఏళ్ల తర్వాత ఈ అన్నదమ్ములు కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా కలుసుకున్నారు. నాటి విభజనతో మొదలైన అనేక కథల్లో ఒకటి ఇది.

''విడిపోయిన సోదరులు కలవటానికి వీలుగా.. నా సోదరుడు హబీబ్‌ పాకిస్తాన్ రావటానికి వీసా ఇవ్వాలని నేను ఇమ్రాన్‌ఖాన్‌ను కోరుతున్నా. మా జీవితం చివరి రోజులను మేం కలిసి గడపగలిగితే.. మా అమ్మానాన్న, అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లతో విడిపోయిన బాధ తగ్గొచ్చు.’’

ఇది మొహమ్మద్ సాదిక్ విజ్ఞప్తి. ఆయన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల ఫైసలాబాద్ జిల్లా చక్ -255‌లో నివసిస్తున్నారు.

వీడియో కాల్

ఆ చిన్న కలయిక

కర్తార్‌పూర్‌లో ఈ సోదరుల కలయికకు ప్రత్యక్ష సాక్షి నసీర్ థిల్లాన్. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కలిసిన వీరిద్దరూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారని ఆయన చెబుతున్నారు. ఈ సందర్భంలో దాదాపు వంద మంది ఉన్నారు.

అందరి కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. కొన్ని గంటలు కలిసి గడిపిన ఈ అన్నదమ్ములు మరోసారి విడిపోతుంటే.. మళ్లీ అందరి కళ్లూ చెమ్మగిల్లాయి.

ఎప్పుడో 75 ఏళ్ల కిందట విడిపోయిన ఈ అన్నదమ్ములు.. తొలిసారిగా రెండేళ్ల కిందట ఒకరి ఆచూకీ ఒకరు తెలుసుకున్నారు. అప్పటి నుంచీ వారు వీడియో కాల్‌లో మాట్లాడుకోని రోజు లేదు. సిద్దిక్‌కి మొబైల్ ఫోన్ ఎలా వాడాలో తెలీదు. ఆయన పిల్లలు, గ్రామస్తులు ఆయనకు సాయం చేస్తారు.

హబీబ్‌కి కూడా ఫోన్ వాడటం తెలీదు. ఆయనకు సిక్కు స్నేహితులు సాయం చేస్తారు. హబీబ్ ఓ సిక్కు కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు.

చక్ -255 గ్రామంలో సిద్దిక్‌ను కలవటానికి మేం వెళ్లినపుడు.. ఆయన తన సోదరుడు హబీబ్‌తో జూమ్‌లో మాట్లాడుతున్నారు. ''నీ మనవళ్లు నిన్ను గుర్తుచేస్తున్నారు. నువ్వు పెళ్లి చేసుకోలేదు. పాకిస్తాన్‌కు రా. నేను నీకు పెళ్లి చేస్తాను’’ అని హబీబ్‌తో చెప్తున్నారు సిద్దిక్.

''నాకు వీసా ఇప్పించమని ఇమ్రాన్ ఖాన్‌తో చెప్పు. ఇండియాలో నాకెవరూ లేరు. ఈ వయసులో చాలా ఒంటరినైపోయాను. ఇంత ఒంటరితనంలో జీవించటం కష్టంగా ఉంది’’ అని సిద్దిక్‌తో చెప్పారు హబీబ్.

భారత్‌లో ఉంటున్న హబీబ్

ఈ అన్నదమ్ములు ఎలా విడిపోయారు?

సిద్దిక్‌కు.. తాను తన కుటుంబం నుంచి ఎలా విడిపోయానో బాగా గుర్తుంది. అప్పుడు ఆయన వయసు పది, పన్నెండేళ్లు ఉంటాయి. హబీబ్‌కి ఏమీ గుర్తు లేదు. తన తల్లి, తండ్రి, అక్క, అన్నల పేర్లు మాత్రమే గుర్తున్నాయి. తాను నివసిస్తున్న ప్రాంతంలో మిగతా వాళ్లు చెప్పగా విన్న విషయాలు గుర్తున్నాయి. అప్పుడు అతడి వయసు ఒకటిన్నర సంవత్సరాలు.

జలంధర్‌లోని జాగ్రావాన్ తమ గ్రామమని సిద్దిక్ చెప్పారు.

''మా నాన్న ఒక భూస్వామి. మా పొలాల్లో చాలా పుచ్చకాయలు ఉండేవని నాకు గుర్తుంది. మా అమ్మ కూడా నాకు గుర్తుంది’’ అని చెప్పారాయన.

తమ తల్లి తన తమ్ముడు హబీబ్‌ను తీసుకుని ఫూల్‌వాలాలోని తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిందని సిద్దిక్ తెలిపారు. ఆ ఊరి పేరు ఇప్పుడు కూడా అదే. ఇప్పుడది బఠిండా జిల్లాలో ఉంది.

''మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాక మా ఊరి మీద దాడి జరిగింది. జనం ప్రాణభయంతో ఊరొదిలి వెళ్లిపోతున్నారు. అందరూ పాకిస్తాన్ వెళుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలు కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు’’ అని తెలిపారు.

''అప్పుడు నేను మా నాన్న, అక్కతో ఉన్నా. ఆ అల్లర్లలో మా నాన్న ఏమైపోయాడో నాకు తెలీదు. నేను, మా అక్క ఎలాగో ఫైసలాబాద్‌లోని శరణార్థి శిబిరానికి చేరుకున్నాం’’ అని చెప్పారు.

''మా అక్క జబ్బుపడి ఫైసలాబాద్ శరణార్థి శిబిరంలోనే చనిపోయింది. ఆ రోజుల్లో మా నాన్న నా కోసం వెదుకుతూ ఫైసలాబాద్‌లోని శరణార్థి శిబిరానికి వచ్చాడు’’ అని సిద్దిక్ తెలిపారు.

మొహమ్మద్ సిద్దిఖ్

''ఈ ఊర్లో కానీ, ఈ ప్రాంతంలో కానీ నాకెవరూ లేరు’’ అని హబీబ్ చెప్పారు. ’’అల్లర్లు మొదలైనపుడు నేను, మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లో చిక్కుకుపోయామని ఈ ప్రాంతం జనం నాకు చెప్పేవాళ్లు. ఈలోగా విభజన పూర్తయింది. పాకిస్తాన్, ఇండియాలు ఏర్పాటైనపుడు.. నాన్న, అక్క అందరూ అల్లర్లలో హత్యకు గురయ్యారని వార్తలు వచ్చాయి. మా అన్న గురించి ఏమీ తెలియలేదు’’ అని ఆయన వివరించారు.

''ఈ షాక్‌ను మా అమ్మ తట్టుకోలేకపోయింది. మొదట్లో ఆమె మానసికంగా దెబ్బతినింది. ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయింది. ఆమె పుట్టింటివాళ్లు కూడా పాకిస్తాన్ వెళ్లిపోయారు’’ అని చెప్పారాయన.

''నా చిన్నప్పటి నుంచీ నా సర్దార్ స్నేహితులనే నేను చూశాను. నేను వాళ్లతోనే బతికాను. వాళ్లతోనే పెరిగాను’’ అని తెలిపారు.

విభజన తర్వాత వచ్చిన కాన్వాయ్‌లు కొంత సమాచారం ఇచ్చేవని సిద్దిక్ చెప్పారు. ''మా అమ్మ కూడా చనిపోయిందని మాకు వార్తలు వచ్చాయి. మా అమ్మమ్మ వాళ్లు కూడా పాకిస్తాన్‌కు వచ్చేయటంతో ఇక సంబంధం లేకుండా పోయింది’’ అని తెలిపారు.

హబీబ్ గురించి ఆయనకు ఎక్కువ వివరాలు తెలియలేదు.

Habib

''మా కాలంలో గుర్తింపు కార్డులు లేవు. పాకిస్తాన్ ఏర్పడటేటప్పటికి నాకు పది, 12 ఏళ్లు ఉన్నాయి. నా తమ్ముడితో చాలా కాలం గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. అమ్మ చనిపోయిందని విన్నాను. అక్క, నాన్నల మృతదేహాలను చూశాను. కానీ.. నా తమ్ముడు బతికే ఉన్నాడని నేను ఇంతకాలం నమ్ముతూనే ఉన్నాను’’ అని సిద్దిక్ చెప్పారు.

''పాకిస్తాన్‌లో మా మేనమామలు నన్ను పెంచారు. ఫైసలాబాద్‌లో వేర్వేరు ప్రాంతాల్లో నివసించాం. ఆ తర్వాత చక్ 255లో మాకు భూమి ఇచ్చారు. అప్పుడు మేం ఈ ఊరికి వచ్చాం’’ అని గతాన్ని గుర్తుచేసుకున్నారు.

''నేను పెళ్లి చేసుకుని.. జీవితాంతం వ్యవసాయం చేస్తూ గడిపాను’’ అని తెలిపారు.

హబీబ్ తన బాల్యం గురించి, గతం గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడలేదు. ''అమ్మానాన్నలు లేని పిల్లల పరిస్థితి ఏమవుతుంది? ఏం జరుగుతుంది? మా అమ్మ నన్ను వదిలి చినిపోయిన ఊర్లోనే నా జీవితం గడిపాను’’ అని చెప్పారాయన.

తను ఎందుకు పెళ్లి చేసుకోలేదనే విషయం కూడా హబీబ్ చెప్పలేదు. ''నాకున్నదంతా నా సర్దార్ స్నేహితులు. ఆ పూల వ్యాపారి. వారు నన్ను, నా అన్నను కలిపారు’’ అని మాత్రమే ఆయన చెప్పారు.

కర్తార్‌పూర్‌లో కలుసుకొన్న అన్నదమ్ములు

తన తమ్ముడి గురించిన జ్ఞాపకాలు తనను కలచివేసేవని సిద్దిక్ చెప్తారు.

''నా తమ్ముడు బతికే ఉన్నాడని నా మనసు ఎప్పుడూ చెప్తుండేది. అతడిని కలవాలని నాకు బలంగా ఉండేది. పీర్లు, ఫకీర్ల దగ్గరికి కూడా వెళ్లాను. నువ్వు ప్రయత్నిస్తే నీ తమ్ముడు దొరుకుతాడు అని అందరూ చెప్పేవాళ్లు’’ అని ఆయన వివరించారు.

''ఊరందరికీ నా కథ తెలుసు. నేను నా కథను మిత్రుడి కొడుకు మొహమ్మద్ ఇష్రాక్‌కు చెప్పాను. అతడు రెండేళ్ల కిందట నసీర్ ధిల్లాన్‌ను వెంటబెట్టుకుని నా దగ్గరకొచ్చాడు. ఆయన నన్ను అన్ని వివరాలూ అడిగాడు. అదంతా కెమెరాతో రికార్డు చేసి వీడియో తీశాడు’’ అని తెలిపారు.

''కొన్ని రోజుల తర్వాత ధిల్లాన్, ఇష్రాక్ మళ్లీ వచ్చారు. నా తమ్ముడి ఆచూకీ తెలిసిందని చెప్పారు. నా తమ్ముడితో మాట్లాడించారు కూడా’’ అని వవరించారు.

''ఉపఖండం విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలను మళ్లీ కలపటానికి.. నేను నా ఫ్రెండ్ లవ్లీ సింగ్.. యూట్యూబ్‌లో పంజాబ్ లెహర్ అనే చానల్ క్రియేట్ చేశాం. అలా విడిపోయిన వారి కథలు మేం చెప్తాం. వారిని కలపటానికి ప్రయత్నిస్తాం’’ అని నసీర్ ధిల్లాన్ తెలిపారు.

సిద్దిక్ కథను యూట్యూబ్‌లో చెప్పినపుడు.. ఆ వీడియోను ఫూల్‌వాలా గ్రామానికి చెందిన డాక్టర్ జగ్ఫీర్ సింగ్ చూశారు. ఆయన సోషల్ మీడియాలో మమ్మల్ని సంప్రదించారు. మేం ఆయనతో ఫోన్‌లో మాట్లాడాం. సిద్దిక్ చెప్పే పేర్లే జగ్ఫీర్ సింగ్ చెప్పారు’’ అని ఆయన వివరించారు.

మొహమ్మద్ హబీబ్ లేదా హబీబ్ ఖాన్‌ను.. తాము శికా అని పిలుస్తుంటామని డాక్టర్ జగ్ఫీర్ సింగ్ చెప్పారు. ''ఆయన అసలు పేరు బహుశా ఈ ప్రాంతంలో చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. వారిలో నేను ఒకడిని. శికా కథను మా పెద్దవాళ్లు చెప్పగా విన్నాను. శికా స్వయంగా తన కథను నాకు చాలా సార్లు చెప్పారు’’ అని ఆయన తెలిపారు.

ఈ రెండేళ్లలో ఏం జరిగింది?

రెండేళ్ల కిందట.. నసీర్ ధిల్లాన్, మొహమ్మద్ ఇష్రాక్‌లు తనను తన తమ్ముడు హబీబ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడించారని సిద్దిక్ చెప్పారు. ''మా సంభాషణ మొదలైనపుడు నేను మొదట అడిగింది.. మా అమ్మా, నాన్నల పేర్లు ఏమిటని. హబీబ్ కరెక్టుగా చెప్పారు. నా పేరు గురించి అడిగినపుడు కూడా కరెక్ట్ సమాధానం ఇచ్చాడు’’ అన్నారాయన.

''తన గురించి, తన కుటుంబం గురించి ఈ ప్రాంతం వాళ్లు చెప్పగా విన్న విషయాలను కూడా హబీబ్ చెప్పాడు. అదంతా నిజం’’ అని సిద్దిక్ తెలిపారు.

''హబీబ్ పాకిస్తాన్ రావాలనుకున్నాడు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే నేను ఇండియా వెళ్లాలని అనుకున్నాం. కానీ దానికి చాలా అవరోధాలున్నాయి’’ అని చెప్పారు.

''ఆ తర్వాత సిద్దిక్‌కు గుర్తింపు కార్డు, పాస్‌పోర్టులు సిద్ధం చేశాం’’ అని ఇష్రాక్ తెలిపారు.

శికాకు ఎలాంటి రేషన్ కార్డు కానీ, గుర్తింపు కార్డు కానీ లేదని జగ్ఫీర్ సింగ్ చెప్పారు. ఇరువైపుల నుంచీ ఇరువురికీ వీసాలు ఇప్పించటానికి ప్రయత్నించాలని జగ్ఫీర్, ధిల్లాన్, ఇష్రాక్‌లు నిర్ణయించుకున్నారు. కానీ అంతలో కరోనావైరస్ రావటంతో ఇది సాధ్యంకాలేదు.

కర్తార్‌పూర్ కారిడార్

వీరు ఎలా కలిశారు?

''ఇప్పుడు కర్తార్‌పూర్ కారిడార్ తెరిచారు కాబట్టి.. ఈ అన్నదమ్ములను కలపటానికి ఈ మార్గంలో ప్రయత్నించాలని మేం చర్చించాం. వాళ్లు కనీసం కొంతసేపైనా కలవాలి అనుకున్నాం’’ అని ధిల్లాన్ చెప్పారు.

కర్తార్‌పూర్ కారిడార్‌ తెరిచినపుడు.. దర్బార్ సాహిబ్‌ను సందర్శించటానికి మేం కార్యక్రమం రూపొందించాం. ''ఇరువైపుల నుంచీ ఒకేసారి ఈ పని చేయాలనుకున్నాం. విడిపోయిన వాళ్లు కూడా కలిసి అక్కడ ప్రణమిల్లాలనుకున్నాం’’ అని జగ్ఫీర్ సింగ్ తెలిపారు.

''మేం బుక్ చేశాం. అందులో సమస్యలేమీ లేవు. ఇరువైపుల నుంచీ ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం మాకు మద్దతు ఇచ్చాయి. అలా జనవరి 10వ తేదీన మేం కర్తాపూర్ చేరుకున్నాం. అప్పటికే మొహమ్మద్ సిద్దిక్, ఆయన కుటుంబం, వారి ఊరంతా అక్కడకు వచ్చేసి ఉంది’’ అని వివరించారాయన.

''నా తమ్ముడికి కానుకగా నేను బట్టలు తెచ్చాను. ఆయన కూడా మా అందరికీ బట్టలు తెచ్చారు. నా తమ్ముడు పాకిస్తాన్ రావాలని నేను కోరుకుంటున్నాం. పాకిస్తాన్ రమ్మని నేను నా తమ్ముడితో చెప్పినపుడు అతడు నా భుజం మీద తలపెట్టి ఏడ్చేశాడు. వస్తానని చెప్పాడు’’ అని సిద్దిక్ తెలిపారు.

''మేమిద్దరం కలిశాం. కన్నీళ్లు పెట్టుకున్నాం. మా అమ్మానాన్నలను గుర్తుచేసుకున్నాం. దర్బార్ సాహిబ్ దగ్గర మేం కలిశాం. మా అమ్మానాన్నలు, బంధువుల కోసం ప్రార్థనలు చేశాం’’ అని చెప్పారు.

''ఫూల్‌వాలాలో జనం నా బాగోగులు చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ వెళ్లి నా మనవళ్లు, మనవరాళ్లతో కొంత కాలం గడపాలని నా మనసు కోరుతోంది. నేను చనిపోయినపుడు.. నా అంత్యక్రియలను నా వాళ్లే చెయ్యాలని కోరుతోంది’’ అని హబీబ్ చెప్పారు.

''నేను ముసలివాడ్ని. నాతో ఎవరికైనా ఏ సమస్యలు వస్తాయి? సిద్దిక్ నాకు రెండు పూట్ల రెండు రొట్టెలు పెట్టగలడు. నాకు వీసా ఇవ్వండి చాలు. లేదంటే బతుకంతా దుఃఖంతో బతికిన నాకు చావు కూడా దుఃఖంగానే ఉంటుంది’’ అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kartapur Corridor:How did the two brothers meet after 75 years of Indo Pak partition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X