హైఓల్టేజ్ ఈవెంట్: ఒకే వేదికపై భారత్, చైనా, పాకిస్తాన్: సైనిక బల ప్రదర్శన
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దు వివాదాలను కేంద్రబిందువుగా చేసుకుని భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతోంది డ్రాగన్ కంట్రీ చైనా. తరచూ సరిహద్దులను దాటుకొని, భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తోంది. వాస్తవాధీన రేఖ వద్ద సుమారు అయిదారు నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. యుద్ధానికి దారి తీసేలా కనపించినా.. ఆ తరువాత సద్దుమణిగాయి. వాస్తవాధీన రేఖ వద్ద చైనాను.. నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ను ఏకకాలంలో అదుపు చేయగలుగుతోంది భారత్.

హైఓల్టేజ్ ఈవెంట్..
ఈ పరిణామాల మధ్య.. చెరో పక్క నుంచి దుందుడుకు చర్యలకు దిగుతోన్న చైనా, పాకిస్తాన్‌లతో కలిసి ఒకే వేదికను పంచుకోబోతోంది భారత్. ఓ సైనిక ప్రదర్శనలో పాలుపంచుకోబోంది. చైనా, పాకిస్తాన్ పాల్గొనబోతోన్నందున.. భారత్ హాజరవుతుందా? లేదా? అనే అనుమానాలకు సైనికాధికారులు తెరదించారు. ఈ సైనిక ప్రదర్శనలో పాల్గొనబోతున్నామని స్పష్టం చేశారు. మెరికల్లాంటి బలగాలను పంపించబోతున్నట్లు స్పష్టం చేశారు. దీనితో ఈ సైనిక ప్రదర్శన.. హైఓల్టేజ్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

కవ్‌కజ్ పేరుతో
రష్యా నిర్వహించబోయే సైనిక బల ప్రదర్శన అది. కవ్‌కజ్-2020 పేరుతో వచ్చేనెల దీన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. ఆతిథ్య దేశం రష్యాతో పాటు ఆసియా ఉపఖండానికి చెందిన భారత్, చైనా, పాకిస్తాన్ ఇందులో పాల్గొనబోతున్నాయి. తమ సైనిక పాటవాన్ని ప్రదర్శించబోతున్నాయి. ఇందులో పాల్గొనడానికి ఇదివరకే రష్యా.. ఈ మూడు దేశాలకూ ఆహ్వానాన్ని పంపింది. చైనా, పాకిస్తాన్ ఇప్పటికే తమ నిర్ణయాన్ని సూచనప్రాయంగా వెల్లడించాయి.

19 దేశాలకు ఆహ్వానం..
ఇక భారత్ కూడా ఇందులో పాల్గొనడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఆసియా ఉపఖండం నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలు దీనికి హాజరు కానున్నాయి. కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మంగోలియా, సిరియా, ఇరాన్, ఈజిప్ట్, బెలారస్, టర్కీ, ఆర్మీనియా, అబ్కాజియా, దక్షిణ ఒస్సెటియా, అజర్‌బైజన్, తుర్క్‌మెనిస్తాన్ దీనికి హాజరుకానున్నాయి. వచ్చేెనెల 15 నుంచి 26వ తేదీల మధ్య ఈ సైనిక ప్రదర్శనను నిర్వహించబోతోంది రష్యా.

కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా..
ఈ ప్రదర్శన ఆరంభం కావడానికి 14 రోజుల ముందే పాల్గొనదలిచిన దేశాలు రష్యాకు బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది. కోవిడ్ ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కరోనా వైరస్ అనుమానితులను అప్పటికప్పుడు క్వారంటైన్‌కు పంపించే ఏర్పాటును చేస్తోంది రష్యా. భారత్ తరఫున ఎంతమంది సైనికులు దీనికి హాజరవుతారనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. ఈ ఈవెంట్‌లో పాల్గొనబోతున్నామనే సమాచారాన్ని ఆర్మీ అధికార వర్గాలు వెల్లడించాయి.

చైనా, పాకిస్తాన్‌లకు ధీటుగా..
తన సైనిక శక్తి సామర్థ్యాలు ఏమిటో చైనా, పాకిస్తాన్‌లకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని భారత్ వినియోగించుకుంటుందని అంటున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలను కూడా ఇందులో వినియోగించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని చైనా.. తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతోన్న పాకిస్తాన్‌లకు ముఖం మొత్తేలా భారత్ సైనిక బలాన్ని ప్రదర్శిస్తుందని అంటున్నారు. మరోసారి భారత్‌పై దుందుడుకు చర్యలకు దిగాలంటే భయం కలిగించేలా వ్యవహరించగలదని భావిస్తున్నారు.