కేరళ ఎన్నికలు... 33 మంది సిట్టింగులకు విజయన్ షాక్... అభ్యర్థుల తొలి జాబితా విడుదల...
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం తరుపున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ముఖ్యమంత్రి పినరయి విజయన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 83 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఐదుగురు మంత్రులతో సహా 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు విజయన్ షాకిచ్చారు. వారి స్థానంలో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చారు. జాబితాలో చోటు దక్కనివారికి పార్టీ పరంగా ప్రాధాన్యత ఉంటుందని... పార్టీలో వివిధ దశల్లో చర్చించిన తర్వాతే జాబితాను ఖరారు చేశామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి విజయరాఘవన్ తెలిపారు.

విజయన్ అల్లుడికి టికెట్...
సీఎం పినరయి విజయన్ ఈసారి ధర్మదం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మంత్రి కెకె శైలజ మట్టన్నూర్ నుంచి,మరో మంత్రి కేటీ జలీల్ తవనూ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.సీఎం విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్‌కు కూడా టికెట్ కేటాయించారు. అలాగే విజయన్ సన్నిహితులైన పి.రాజీవ్,కేఎన్ బాలగోపాల్,వీఎన్ వాసవన్,ఎంబీ రాజేష్ తదితరులకు టికెట్లు దక్కాయి. ఈ నలుగురు 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేశారు.

ఈసారి పోటీకి ఆయన దూరం...
పార్టీకి చెందిన ప్రముఖ నేతలు థామస్ ఇసాక్,జి.సుధాకరన్,ఈపీ జయరాజన్,ఏకె బాలన్,సి.రవీంద్రనాథ్ సహా పలువురు నేతలకు తొలి జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. యువతకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సీనియర్లందరినీ పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఇక వయసు పైబడిన కారణంగా 1996 తర్వాత తొలిసారిగా వీఎస్ అచ్యుతానందన్(97) ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు.
తాజా జాబితాలో 12 మంది మహిళలకు చోటు కల్పించారు. ఇందులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి విజయరాఘవన్ భార్య ఆర్.బిందు కూడా ఉన్నారు. వృత్తి రీత్యా ప్రొఫెసర్ అయిన ఆమె గతంలో త్రిసూర్ మేయర్‌గా పనిచేశారు.

అభ్యర్థులందరూ విద్యావంతులే...
మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో ఎల్‌డీఎఫ్ కూటమిలో భాగంగా సీపీఎం 85 స్థానాల్లో పోటీ చేస్తోంది. తాజాగా 83 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించడంతో మరో రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తొలి జాబితాలోని 83 మందిలో 74 మంది సీపీఎం గుర్తుపై పోటీ చేస్తారు. మిగతా తొమ్మిది ఎల్‌డీఎఫ్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు. వారు ఈసీ కేటాయించే గుర్తుపై పోటీ చేస్తారు. ఈ 83 మందిలో 42 మంది గ్రాడ్యుయేట్స్ కాగా 14 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్,ఇద్దరు డాక్టర్లు,ఇద్దరు పీహెచ్‌డీ స్కాలర్లు,ఒక ఆర్కిటెక్ట్ ఉన్నారు. మరో 28 మంది అభ్యర్థులు న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు.












Click it and Unblock the Notifications