అయ్యప్ప స్వాములు ఇక బేఫికర్- రూ.5 లక్షల ఫ్రీ బీమా కవరేజీ..!!
Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు సన్నద్ధమౌతోన్నారు. కార్తీక మాసం ఆరంభమైన నేపథ్యంలో ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాల ధారణ చేస్తోన్నారు. నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలువనున్నారు.
మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం ఈ నెల 16వ తేదీన అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరచుకోనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ చివరి వారం వరకూ ఆలయ తలుపులను తెరిచే ఉంచుతారు. అనంతరం మూసివేస్తారు. జ్యోతి దర్శనం కోసం జనవరి రెండో వారంలో ఆలయాన్ని తెరుస్తారు.

ఈ ఏడాది 20 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్పస్వామివారిని దర్శించుకోవచ్చని కేరళ ప్రభుత్వం అంచనా వేసింది. గత ఏడాది 15 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు చేరుకున్నందున ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసన్, ట్రావెన్‌కోర్ దేవస్వొం బోర్డ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పినరయి విజయన్ పలు నిర్ణయాలను తీసుకున్నారు. లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు శుభవార్త వినిపించారు. స్వామివారిని దర్శించుకోవడానికి శబరిమలకు వెళ్లే భక్తులందరిపై వరాలను కురిపించారు. అయిదు లక్షల రూపాయల ఉచిత బీమా కవరేజీని ప్రకటించారు.
దర్శనానికి వెళ్లిన ఏ భక్తుడైనా సరే మరణించినా లేదా ప్రమాదం బారిన పడినా ట్రావెన్‌కోర్ దేవస్వొం బోర్డు అయిదు లక్షల రూపాయలు చెల్లిస్తుంది. దురదృష్టవశావత్తూ ఎవరైనా మరణించితే వారి భౌతిక కాయాన్ని స్వస్థలాలకు తరలించడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

యాత్ర సమయంలో అయ్యప్ప భక్తుల భద్రత కోసం 13,600 మంది పోలీసులు, 2,500 మంది అగ్నిమాపక- రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బందిని నియమించారు. 1,000 మంది శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు యాత్ర సాగే ప్రదేశాలు, అక్కడి పరిసరాలను శుభ్ర పరుస్తారు.
భక్తులు ప్రమాదాల బారిన పడితే తక్షణమే వారికి ప్రాథమిక చికిత్స అందేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. మెరుగైన చికిత్స అవసరమైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా నీలక్కళ్, సన్నిధానం, కొట్టాయం మెడికల్ కాలేజీ, పథినంథిట్ట, కంజీరపల్లి ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications