
కేరళ గవర్నర్ సంచలనం-9 మంది వీసీల రీకాల్-తేల్చేందుకు హైకోర్టు స్పెషల్ సిట్టింగ్
కేరళలో 9 యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లను రాజీనామాలు కోరుతూ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి. 9 మంది వీసీల రాజీనామాలకు గవర్నర్ ఈ ఉదయం 11.30 గంటల వరకూ గడువు విధించారు. అయితే గవర్నర్ నిర్ణయాన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు కేరళ హైకోర్టు ఇవాళ సాయంత్రం ప్రత్యేకంగా భేటీ కానుంది.
విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్‌లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తన ఉత్తర్వుల్లో గుర్తుచేశారు. అయితే ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను "నాశనం" చేయాలనే ఉద్దేశ్యంతో "యుద్ధం" చేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ సంఘ్ పరివార్‌తో పోటీగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం, విద్యాపరంగా స్వతంత్రంగా ఉండాల్సిన యూనివర్సిటీల అధికారాల్ని అతిక్రమించేలా గవర్నర్ చర్య ఉందని సీఎం విజయన్ ఆరోపించారు.

కేరళ ప్రభుత్వం వివిధ యూనివర్శిటీలకు వీసీలను సొంతంగా నియమిస్తున్న నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. అయితే ఆ నియామకాలు తన బాధ్యత అని గవర్నర్ అభ్యంతరం తెలిపారు. దీంతో కేరళ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కన్నూర్ యూనివర్సిటీ, ఏపీజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్శిటీ, శ్రీ శంకరాచార్య సంస్కృత యూనివర్శిటీ, కాలికట్ యూనివర్శిటీ, తుంచత్ ఎజుతచ్చన్ మలయాళ యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని గవర్నర్ కోరారు. దీనికి నిరసనగా వచ్చే నెలలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నిర్ణయించింది.