కేరళలో నరబలి వివాదం: 'మంత్రగాడి సలహాతో' ఇద్దరు మహిళలను హత్య చేసిన దంపతులు.. ఏం జరిగింది?

కేరళలో నరబలి కేసు నిందితులు

కేరళలో 'నరబలి' పేరుతో ఇద్దరు మహిళలను హత్య చేసిన ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణానికి సంబంధించి కేరళలోని ఎర్నాకుళంలో భార్యాభర్తలతో పాటు, ఒక పురుషుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మంత్రగాడినని చెప్పుకుంటున్న సదరు వ్యక్తి సలహా మేరకు నిందితులైన దంపతులు 'నరబలి' కోసం ఈ హత్యలు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.

నిందితుల్లో కేరళలోని పతనమిట్టలో తిరువళ్లకు చెందిన నాటు వైద్యుడు భగావల్ సింగ్, ఆయన భార్య లైలాతో పాటు.. మంత్రగాడినని చెప్పుకుంటున్న మొహమ్మద్ షఫీ ఉన్నారు.

జూన్‌లో ఒకరు, సెప్టెంబరులో ఒకరు అదృశ్యం...

రోసలిన్ (49) కేరళలో లాటరీ టికెట్లు అమ్ముతుండేవారు. ఆమె జూన్ నుంచి కనిపించకుండా పోయారని ఆమె బంధువులు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో నివసించే ఆమె కూతురు దీనికి సంబంధించి ఆగస్టు 17వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా.. ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌లో లాటరీ టికెట్లు విక్రయించే పద్మ అనే 52 ఏళ్ల మహిళ కూడా సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అదృశ్యమైనట్లు గుర్తించారు. పద్మ స్వస్థలం తమిళనాడులోని ధర్మపురి. ఈ ఇద్దరు మహిళల అదృశ్యం మీద పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.

https://twitter.com/ANI/status/1579747426394857474

దర్యాప్తు వివరాలను కదవంతర పోలీసులు బీబీసీకి తెలిపారు.

''పద్మను ఎవరో తీసుకెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా మాకు తెలిసింది. అతడి పేరు రషీద్ అలియాస్ మొహమ్మద్ షఫీ అని తెలిసింది. పతనమిట్టలో గల తిరువళ్లలో నివసించే స్థానిక నాటు వైద్యుడు భగావల్ సింగ్, ఆయన భార్య లైలాల కోసం పద్మను అపహరించినట్లు కనుగొన్నాం. వారికి ఆర్థిక సమస్యలున్నాయి. వాటి నుంచి బయటపడటానికి నరబలి ఇవ్వాలని ఆ దంపతులకు మొహమ్మద్ షఫీ సలహా ఇచ్చి, ఒప్పించాడు. పద్మను నరబలి కోసం ఆ దంపతుల ఇంటికి తీసుకెళ్లారు'' అని పోలీసులు వివరించారు.

నేరం

దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు

''ఎర్నాకుళం నుంచి వేర్వేరు సమయాల్లో ఇద్దరు వేర్వేరు మహిళలను తీసుకురావటంలో మొహమ్మద్ షఫీ సాయం చేశాడు. మొదట ఒక మహిళను నరబలి కోసం తీసుకురావటానికి అతడు మధ్యవర్తిగా పనిచేశాడని తొలుత మేం భావించాం. దర్యాప్తు క్రమంలో మరో మహిళను కూడా బలి ఇచ్చారని, దీని వెనుక కీలక సూత్రధారి షఫీ అని తేలింది'' అని కేరళ సౌత్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రకాష్ చెప్పారు.

దర్యాప్తు గురించి కొచ్చి నగర పోలీస్ కమిషనర్ నాగరాజు చక్కిలం మరిన్ని వివరాలు తెలిపారు.

''పద్మ ఎలా అదృశ్యమయ్యారనే అంశంపై మేం దర్యాప్తు చేసినపుడు.. ఆమె సెల్‌ఫోన్ చివరి టవర్ లొకేషన్.. ఆమె షఫీతో మాట్లాడినట్లు చూపింది. దీంతో మేం షఫీని విచారించాం. పద్మ సహా ఇద్దరు మహిళలను తిరువళ్లలో నరబలిలో చంపినట్లు అతడు అంగీకరించాడు. దీంతో ఆ జంటను మేం విచారించాం. రోసిలిన్ అనే మరో మహిళను కూడా నరబలిలో హత్య చేసినట్లు వారు అంగీకరించారు'' అని ఆయన చెప్పారు.

ఈ హత్యల వెనుక పూర్తి విషయాలను తెలుసుకోవటానికి ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు.

హతురాలు పద్మ

పద్మ కేరళకు ఎందుకు వెళ్లారు?

తమిళనాడులోని ధర్మపురిలో ఉన్న పద్మ భర్త రంగన్‌తో బీబీసీ మాట్లాడింది.

''నా భార్యను జీవనోపాధి కోసం కేరళ పంపించాను. ఇలా జరుగుతుందని నాకు ముందుగా తెలిసినట్లయితే ఆమెను పంపిచేవాడిని కాదు. నేను వృద్ధాప్యం వల్ల పని చేయలేకపోతున్నాను. అందుకే ఆమె అక్కడికి వెళ్లింది. కానీ ఇలా చనిపోయింది. దీనిని జీర్ణించుకోలేకపోతున్నాను. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు'' అని చెప్పారాయన.

ప్రాధమిక దర్యాప్తులో ఈ హత్యలకు కారణం నరబలి అని వెల్లడైంది. హతుల మృతదేహాలను నిందితులైన దంపతుల ఇంటి ఆవరణలో పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వాటిని తవ్వి తీయటానికి చట్టపరమైన చర్యలు మొదలుపెట్టారు.

రోసలిన్ కూతురు మంజు తన తల్లిని వెదుక్కుంటూ గత ఆగస్టులో ఉత్తర ప్రదేశ్ నుంచి కేరళ వచ్చారు. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి హత్యకు గురైన విషయం వార్తల ద్వారానే తనకు తెలిసిందని, పోలీసుల నుంచి అధికారికంగా సమాచారం అందలేదని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+