గ్యాంగ్ రేప్‌ను కవర్ చేయడానికి వెళ్లి అరెస్టయిన ఆ జర్నలిస్ట్‌కు రెండేళ్ల తరువాత బెయిల్..!!
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ అరెస్ట్ వ్యవహారంపై ఉత్తర ప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది. ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో రెండు సంవత్సరాల కిందట సంభవించిన దళిత మహిళ సామూహిక అత్యాచారం, హత్యోదంతం ఘటనను కవరేజ్ చేయడానికి వెళ్లిన సిద్ధిక్ కప్పన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్రాస్ కు వెళ్లే దారిలో ఉండగానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఆ తరువాత ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఉగ్రవాదం, మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద సిద్ధిక్ కప్పన్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు. అప్పటి నుంచి ఆయన ఉత్తర ప్రదేశ్ జైలులో గడుపుతున్నారు. ఇవ్వాళ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ బెయిల్ లభించింది. సిద్ధిక్ కప్పన్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు సరైన సాక్ష్యాధారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు న్యాయస్థానానికి సమర్పించలేకపోయారు.

ఇప్పటికే ఆయనను చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ), ఇతర అనుబంధ చట్టాల కింద దాఖలు చేసిన ఉగ్రవాద కేసులో నుంచి విముక్తి లభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ- మనీ లాండరింగ్ కేసు నమోదు కావడం వల్ల ఉత్తర ప్రదేశ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయలేదు. దీనితో కారాగారంలోనే గడపాల్సి వచ్చిందాయనకు.
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, దాని విద్యార్థి విభాగం క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) సభ్యులని పోలీసులు పేర్కొన్నారు. మత విద్వేషాలను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో పీఎఫ్‌ఐ నుంచి అందిన ఆదేశాల మేరకే ఆయన హత్రాస్ కు వెళ్తున్నారనేది సిద్ధిక్ కప్పన్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ. దీనిపై సరైన సాక్ష్యాధారాలను పోలీసులు సమర్పించలేకపోవడంతో ఇవ్వాళ హైకోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications