ఏపీ, తెలంగాణ సరసన కేరళ.. నేటి నుంచి ఉచిత బస్సు
ముఖ్యమంత్రి వీడీ సతీషన్ సారథ్యంలో కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా మొదటి అడుగు వేసింది. ఈ క్రమంలో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. కొద్దిసేపటి కిందటే వీడీ సతీషన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం తిరువనంతపురం థంపనూర్ బస్ టెర్మినల్ నుంచి సచివాలయం వరకూ బస్సులో ప్రయాణించారు. దీనికి ప్రియదర్శని అని పేరు పెట్టారు.
మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటకల సరసన కేరళ కూడా నిలిచింది. ఇప్పటికే ఈ మూడు రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలులో ఉన్న విషయం తెలిసిందే. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు బస్ స్టేషన్ నుంచి సచివాలయం వరకు ప్రయాణించారు. ఈ బస్సుకు ఓ ప్రత్యేకత ఉంది. డ్రైవర్, కండక్టర్ మహిళలే.

ప్రారంభ దశలో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సుమారు 3,125 ఆర్డినరీ బస్సులు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. క్రమంగా దీన్ని ఎక్స్ ప్రెస్ బస్సులకు విస్తరించనున్నారు. బస్సులు పరిమిత సంఖ్యలో ఉన్న కారణంగా ఒకేసారి అన్నింట్లోనూ ప్రియదర్శిని పథకాన్ని అమలు చేయట్లేదు ప్రభుత్వం. ఆగస్టు 15వ తేదీ నాటికి అన్ని ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ పథకం అమలులోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ పథకం కింద మహిళలు, ట్రాన్స్‌జెండర్లు మొత్తం ఏడు రకాల కేఎస్ఆర్టీసీ ఆర్డినరీ సేవల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణికులు సులభంగా గుర్తించేలా పథకం వర్తించే బస్సులపై ప్రారంభానికి ముందే ప్రత్యేక స్టిక్కర్లు అతికించారు. 1. ఆర్డినరీ, 2. సిటీ ఆర్డినరీ, 3. లిమిటెడ్ స్టాప్, 4. ఫేర్ స్టేజ్ 5. టౌన్ టు టౌన్, 6. పాయింట్ టు పాయింట్, 7. గ్రామీణ ఆర్డినరీ బస్సుల్లో ప్రియదర్శిని పథకం అమలులోకి వచ్చింది. ప్రాథమిక లెక్కల ప్రకారం ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల కేఎస్ఆర్టీసీపై రోజూ సుమారు రెండు కోట్ల రూపాయల భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం వీడీ సతీషన్ మాట్లాడారు. ఈ పథకాన్ని.. మహిళల పట్ల తమకు ఉన్న అపారమైన గౌరవానికి ప్రతీకగా అభివర్ణించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించడం అలవర్చుకోవాలనే బలమైన సందేశాన్ని ఇచ్చినట్టయిందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 800 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించడం మహిళలపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని ఆయన వివరించారు.
రాష్ట్రంలో ప్రయాణ సేవల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంతో పాటు కేఎస్‌ఆర్‌టీసీ రవాణా రంగాన్ని ప్రగతిపథంలో నడిపించాల్సి ఉందన్నారు. సంస్థ ఆదాయాన్ని భారీగా పెంపొందించడంలో కేఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగులు అత్యంత కీలకమైన పాత్రను పోషించాలని సూచించారు. ప్రభుత్వ రవాణా సంస్థ మనుగడ అక్కడి సిబ్బంది బాధ్యతాయుతమైన పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications