కేరళ సీఎం పేరు ఖరారు.. 11 రోజుల ఉత్కంఠకు తెర
కేరళలో గత 11 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన తుది విడత చర్చల అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. సీఎం రేసులో చివరి వరకు గట్టి పోటీనిచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను వెనక్కి నెట్టి, ఎమ్మెల్యేల మద్దతుతో సతీశన్ ఈ పదవిని దక్కించుకున్నారు. ఈ పరిణామంతో తిరువనంతపురం నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ శ్రేణుల్లో సందడి నెలకొంది.
ముఖ్యమంత్రి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ గత వారం రోజులుగా తీవ్ర కసరత్తు చేసింది. మే 4న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యూడీఎఫ్ ఘనవిజయం సాధించినప్పటికీ.. సీఎం అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జాప్యం జరిగింది. ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, రాష్ట్ర ఇన్‌చార్జ్ దీపా దాస్ మున్షీ ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. మెజారిటీ ఎమ్మెల్యేలు వీడీ సతీశన్ వైపే మొగ్గు చూపడంతో అధిష్టానం ఆయన పేరుకే మొగ్గు చూపింది.

రాహుల్ గాంధీ కూడా ఈ ఎంపికలో కీలక పాత్ర పోషించారు. బుధవారం సాయంత్రం మల్లిఖార్జున్ ఖర్గేతో సుమారు 30 నిమిషాల పాటు భేటీ అయిన రాహుల్ గాంధీ.. గురువారం ఉదయం కేసీ వేణుగోపాల్‌తో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉంటూ వామపక్ష ప్రభుత్వంపై వీడీ సతీశన్ చేసిన పోరాటం, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌తో ఆయనకు ఉన్న అనుబంధం ఆయనకు కలిసివచ్చింది. 61 ఏళ్ల సతీశన్ ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నడిపించబోతున్నారు.
మరికాసేపట్లో తిరువనంతపురంలో కేరళ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పరిశీలకులు అధికారికంగా వీడీ సతీశన్ పేరును ప్రతిపాదించనున్నారు. పదేళ్ల తర్వాత కేరళలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్, సతీశన్ నాయకత్వంలో సుస్థిర పాలన అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేసీ వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రిని చేయాలని భావించిన ఓ వర్గం నేతలు అధిష్టానం నిర్ణయంతో కాస్త నిరాశ చెందినప్పటికీ, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అందరూ ఏకతాటిపైకి రావాలని అధిష్టానం సూచించింది.












Click it and Unblock the Notifications