ఆ పార్టీకి కేరళ సలామ్
తాజాగా ముగిసిన నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ఆరంభమైంది. పశ్చిమ బెంగాల్‌లో చివరిదశ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా హౌస్‌లు, ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, కేరళలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)ను ఓడించి, స్పష్టమైన మెజారిటీ సాధిస్తుంది. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాలను పరిశీలిస్తే యూడీఎఫ్‌కు 70-75 సీట్లు ఖాయమని పీపుల్స్ పల్స్ తెలిపింది. అధికార మార్పునకే మళ్లీ కేరళ ఓటర్లు ఓటేశారని అంచనా వేసింది.

వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల ఎల్‌డీఎఫ్ కూటమికి ఈ సారి భంగపాటు తప్పదని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి పీఠం ఖాయమని సర్వేలో వెల్లడైంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మెజార్టీకి 71 సీట్లలో గెలవాలి. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ 75-85, ఎల్‌డీఎఫ్ 55-65, ఎన్డీఏ 0-3 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి. యూడీఎఫ్ కూటమి ఎల్‌డీఎఫ్ కంటే 2 శాతం ఆధిక్యత కనబరుస్తుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది.
ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పనితీరుపై సర్వేలో 55.1 శాతం సంతృప్తి వ్యక్తం చేసినా మళ్లీ అధికారం కట్టబెట్టకపోవడం ఇక్కడ విశేషం. ఎల్‌డీఎఫ్‌కు మరోసారి అవకాశం ఇవ్వబోమని 42 శాతం చెప్పారు. ముఖ్యమంత్రిగా పినయర్ విజయన్‌కు 22.3 శాతం, కాంగ్రెస్ నేత వీడీ సతీషన్‌కు 14.5 శాతం మంది మద్దతిచ్చారు. ఎన్నికల్లో పార్టీకి ప్రాధన్యతిచ్చామని 51.8 శాతం చెప్పగా, 33.1 శాతం మంది అభ్యర్థులను బట్టి ఓటు వేశామని చెప్పారు.
కేరళలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభావం నామమాత్రంగానే కనిపించింది. రాష్ట్రంలో ఎన్డీఏ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగలేదని సర్వేలో వెల్లడైంది. 59.4 శాతం మంది రాష్ట్రంలో మూడు ఫ్రంట్ అవసరం లేదని సర్వేలో చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై 50.9 శాతం అసంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రచారంపై కేరళలో ఆసక్తి కనిపించలేదు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ముఖాముఖి పోటీ జరిగిన కేరళలో పదేళ్ల వామపక్ష ప్రభుత్వానికి ప్రజలు బ్రేకులు వేసినట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది.












Click it and Unblock the Notifications