'కేరళ వాళ్లే అసలైన భారతీయులు'
న్యూఢిల్లీ : వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే ప్రెస్ కౌన్సిల్ మాజీచైర్మన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయతకు అసలైన కొలమానం కేరళీయులే అన్న తరహాలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
నిజమైన భారతీయులు అన్న మాటకు కేరళ వాసులే కరెక్ట్ అంటూ ఖట్జూ తన ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టడం ప్రస్తుత వివాదానికి కేంద్రబిందువుగా మారింది. అయితే దీనిపై వివరణ కూడా ఇచ్చుకున్న కట్జూ.. భారతీయులకు ఉండే సహజ లక్షణాలు కేరళ వాసుల్లో మెండుగా ఉన్నాయని, సామరస్యంతో కలిసి జీవించడమనే గొప్ప భారతీయ గుణం కేరళ వాసుల్లో ఉందని కితాబిచ్చారు.

భిన్న కులాలు, మతాలకు చెందిన వ్యక్తులు కలిసిమెలిసి జీవనం సాగించడాన్ని కేరళ వాసుల్లో గమనించవచ్చునని, వాళ్లంతా పరస్పరం తమ అభిప్రాయాలు గౌరవించుకుంటారని తన పోస్టులో అభిప్రాయపడ్డారు కట్జూ. కేరళ వాసుల విశాల దృక్పథాన్ని మిగతా దేశ ప్రజలు కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరముందన్నారాయన.
ఇదిలా ఉంటే.. కట్జూ పోస్టు కేరళ వాసులను ఆనందంలో ముంచెత్తింది. కట్జూ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఫేస్ బుక్ లో ఆయన పెట్టిన పోస్టుకు వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు పోటెత్తుతున్నాయి. కట్జూ పోస్టుకు ఇప్పటిదాకా 21వేల లైకులు, 14,400 షేరింగ్స్ రావడం గమనార్హం. కాగా, ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన లేకుండా కట్జూ చేసిన ఈ పోస్టుపై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి.