కింగ్ మేకర్ ఒవైసీ.. రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్!
Bihar Politics: బీహార్ రాజకీయ ముఖచిత్రం 2026లో సరికొత్త మలుపు తిరగబోతోంది. రాష్ట్ర రాజకీయాల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బీహార్ నుంచి 5 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కావాల్సిన నెంబర్ గేమ్ ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం చుట్టూ తిరుగుతోంది. ఒవైసీ మద్దతు లేకుండా ఐదో సీటును గెలవడం ఏ కూటమికీ సాధ్యం కాదనే పరిస్థితి నెలకొంది. 2026లో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఓవైసీ 'కింగ్ మేకర్'గా అవతరించబోతున్నారనే విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
రాజ్యసభ లెక్కలు.. విజేతకు కావాల్సిన ఓట్లు
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిబంధనల ప్రకారం ఒక రాజ్యసభ స్థానాన్ని గెలవాలంటే ఒక అభ్యర్థికి కనీసం 41 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. ప్రస్తుతం అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి 202 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ లెక్కన ఎన్డీఏ నాలుగు స్థానాలను (41 x 4 = 164) సునాయాసంగా గెలుచుకుంటుంది. ఆ తర్వాత ఎన్డీఏ దగ్గర కేవలం 38 ఓట్లు మాత్రమే మిగులుతాయి. ఐదో సీటు గెలవాలంటే వారికి ఇంకా 3 ఓట్లు తక్కువ అవుతున్నాయి. మరోవైపు ఇండియా కూటమి బలం కేవలం 35 ఓట్లు మాత్రమే. వారు ఒక సీటు గెలవాలన్నా వారికి ఇంకా 6 ఓట్లు అదనంగా కావాలి.

కింగ్ మేకర్‌గా ఒవైసీ
ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ పాత్ర కీలకంగా మారింది. బీహార్ అసెంబ్లీలో ఏఐఎంఐఎం పార్టీకి ప్రస్తుతం 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒవైసీ తన 5 ఓట్లను ఎన్డీఏకు ఇస్తే, వారు ఐదో స్థానాన్ని కూడా కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేస్తారు. ఒకవేళ ఒవైసీ తన ఎమ్మెల్యేల మద్దతును ఇండియా కూటమికి ఇస్తే (35 + 5 = 40), దానికి తోడు ఒక బీఎస్పీ ఎమ్మెల్యే ఓటు కలిస్తే (41), ఇండియా కూటమి ఒక స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది.
ఎవరికి సవాల్?
ప్రస్తుతం పదవీకాలం ముగియనున్న వారిలో ఆర్జేడీ నుంచి ఇద్దరు (ప్రేమ్ చంద్ గుప్తా, అమరేంద్ర ధారి సింగ్), జేడీయూ నుంచి ఇద్దరు (హరివంశ్, రామ్ నాథ్ ఠాకూర్), ఆర్‌ఎల్‌ఎం నుంచి ఉపేంద్ర కుష్వాహా ఉన్నారు. 2026 నాటికి ఈ స్థానాలను భర్తీ చేసే క్రమంలో ఒవైసీ ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒవైసీని 'బి-టీమ్' అని విమర్శించిన ఇండియా కూటమి పార్టీలు, ఇప్పుడు ఆయన మద్దతు కోసం ప్రాధేయపడతాయా? లేదా ఎన్డీఏనే తన చాణక్యంతో ఆ ఓట్లు సాధిస్తుందా? అన్నది వేచి చూడాలి. బీహార్ రాజ్యసభ పోరులో ఒవైసీ పాత్ర అనివార్యంగా మారింది. ఇది కేవలం రాజ్యసభ ఎన్నికలకే పరిమితం కాకుండా రానున్న రాజకీయ పరిణామాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications