రూ. 25కోట్ల పాతనోట్ల మార్పిడి: శేఖర్‌రెడ్డికి సాయం చేసిన వ్యాపారి అరెస్ట్
కోల్‌కతా: వేలకోట్ల అక్రమాస్తులను కూడబెట్టి ఇటీవల ఐటీ అధికారులకు చిక్కిన టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి సాయం చేసిన కోల్‌కతాకు చెందిన బడా వ్యాపారవేత్త పారస్‌మాల్ లోధాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు గురువారం అరెస్టు చేశారు. ముంబై విమానాశ్రయంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
చెన్నైకి చెందిన శేఖర్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన న్యాయవాది రోహిత్ టండన్‌కు సంబంధించిన దాదాపు రూ.25కోట్లు పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చేందుకు లోధా సహాయం చేసినట్లు ఈడీ గుర్తించింది. కోల్‌కతాలోని ప్రముఖ వ్యాపారవేత్తలో లోధా ఒకరు. ఇటీవల జరిగిన ఆయన కుమార్తె వివాహానికి పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ నటులు హాజరయ్యారు.

కాగా, ఇటీవల ఢిల్లీలోని న్యాయవాది రోహిత్ టండన్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేసి దాదాపు రూ.13.65కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.2.60కోట్ల కొత్త నోట్లు ఉన్నాయి. టండన్ ఆస్తులు మొత్తం వెయ్యి కోట్ల విలువ పైనే ఉంటాయి.
పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆదాయపు పన్ను శాఖ, ఈడీ అధికారులు పలువురు ఇళ్లపై దాడులు చేసి కోట్లాది రూపాయలు నల్లధనాన్ని, కిలోల కొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అక్రమ నగదు లావాదేవీల వ్యవహారంలో బుధవారం సాయంత్రం శేఖర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన మరుసటి రోజే లోధాను కూడా అరెస్టు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications