నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణపట్నం ఆనందయ్య: ప్రభుత్వం అనుమతితోనే కరోనా మందు పంపిణీ: ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ అనుమతి వచ్చాకే తన మందు పంపిణీ చేస్తానని కృష్ణపట్నం ఆనందయ్య చెప్పినట్లు సాక్షి వార్తా కథనం ప్రచురించింది.

కరోనా నివారణకు వన మూలికలతో తాను తయారు చేసే మందును ప్రభుత్వ అనుమతులు వచ్చాకే పంపిణీ చేస్తామని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు చెందిన బొణిగి ఆనందయ్య తెలిపారు.

ప్రజల మద్దతు, ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళతానని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నెల్లూరులో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తాను తయారు చేసిన మందుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు.

తాను తయారు చేసిన మందు వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని ఇప్పటికే ఆయుష్‌ బృందం నిర్ధరించిందని చెప్పారు.

ఐసీఎంఆర్‌ వాళ్లు కూడా వచ్చి మందును పరిశీలిస్తారని అధికారులు చెప్పారన్నారు.

ఆ తర్వాత అనుమతులు వచ్చాకే మందును ఎలా పంపిణీ చేయాలనే విషయమై ప్రభుత్వ సూచన, సహకారం మేరకు ఎమ్మెల్యే కాకాణి, ఇతర పెద్దలందరితో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.

ఆయుర్వేద మందుపై ఎటువంటి ఆరోపణలు తగవని, అనుమానాలు కూడా సరికాదని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలోగా మందుకు సంబంధించిన మూలికల సేకరణలో ఆనందయ్య ఉంటారని ఆయన తెలిపారని సాక్షి వివరించింది.

ప్రతీకాత్మక చిత్రం

ఒకే మండపంలో అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన వరుడు

అక్కను పెళ్లి చేసుకున్న ఒక యువకుడు, తర్వాత మతిస్థిమితంలేని ఆమె చెల్లెల్ని కూడా పెళ్లాడాడని ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

మండపంలో పెళ్లి కూతుళ్లుగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు! ఆ ఇద్దరి మెడలో ఒకే ముహుర్తానికి తాళి కట్టాడో వ్యక్తి.

మెదక్‌ జిల్లా కొల్చారం మండలం హంసాన్‌పల్లిలో ఆదివారం ఈ పెళ్లి జరిగింది. వెంకటేశం దంపతులకు స్వాతి, శ్వేత కూతుళ్లు.

పెద్ద కూతురు స్వాతికి శివ్వంపేట మండలం పాంబండ గ్రామానికి చెందిన బాల్‌రాజ్‌తో వివాహం నిశ్చయమైంది.

వెంకటేశం చిన్న కూతురు శ్వేతకు మతిస్థిమితం సరిగ్గాలేదు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకురారని తల్లిదండ్రులు భావించారని ఆ కథనంలో రాశారు.

దీంతో బాల్‌రాజ్‌, స్వాతి వివాహం అయిన వెంటనే అదే ముహూర్తానికి శ్వేత మెడలోనూ బాల్‌రాజ్‌తోనే తాళి కట్టించారు.

స్వాతిని అత్తింటికి పంపుతామని, శ్వేత మాత్రం తమ వద్దే ఉంటుందని కుటుంబ సభ్యులు చెప్పారని ఆంధ్రజ్యోతి రాసింది.

ఏపీలో నేటి నుంచి టీకా

ఏపీలో 45 ఏళ్లకు పైబడినవారికి నేటి నుంచి టీకా

ఏపీలో 45 ఏళ్లు పైబడినవారికి ఇవాళ్టి నుంచి టీకా వేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

హై రిస్క్‌ కేటగిరీకి చెంది 45 ఏళ్లు పైబడిన వారికి సోమవారం నుంచి మూడు రోజులపాటు వ్యాక్సినేషన్‌ కోసం జిల్లాల్లో కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.

ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగిన ఆర్టీసీ, రైల్వే, బ్యాంకింగ్‌, పోర్టులు, ప్రజా పంపిణీ వ్యవస్థలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు, పాత్రికేయులను హైరిస్క్‌ కేటగిరీగా గుర్తించామన్నారు.

రాష్ట్రంలో 13.13 లక్షల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వీటిలో 1.55 లక్షల కొవాగ్జిన్‌ టీకాలను రెండో డోసు కింద, 11.58 లక్షల కొవిషీల్డ్‌ టీకాలను మొదటి డోసుగా ఇస్తారని సింఘాల్‌ వివరించారు.

టీకాల కొరతతో 18-45 ఏళ్లలోపు వారికి ప్రస్తుతానికి వ్యాక్సినేషన్‌ లేదని ఆయన స్పష్టం చేశారు.

ఆక్సిజన్‌పై నిర్వహిస్తున్న ఆడిట్‌తో చాలా ఆసుపత్రుల్లో 10- 15% తగ్గుదల కనిపించిందని తెలిపారని ఈనాడు వివరించింది.

కరోనా థర్డ్ వేవ్

థర్డ్ వేవ్‌ను ఎదుర్కోడానికి సన్నాహాలు

థర్డ్ వేవ్‌ను ఎదుర్కోడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయని నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ప్రస్తుతం దేశాన్ని సెకండ్‌వేవ్‌ (రెండోదశ ఉద్ధృతి) కకావికలం చేస్తున్నది.

ఈ దశను ముందే కచ్చితంగా అంచనా వేయగలిగి ఉంటే సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉండేదన్న భావన వైద్యవర్గాల్లో వ్యక్తమవుతున్నది.

రానున్న కాలంలో మూడోవేవ్‌ ముప్పు పొంచి ఉందన్న శాస్త్రవేత్తల హెచ్చరికలతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

ఈ వేవ్‌లో ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ప్రభావానికి లోనయ్యే ప్రమాదమున్నదన్న వార్తల నేపథ్యంలో కట్టుదిట్టమైన ప్రణాళికలు అమలు చేస్తున్నాయని పత్రిక చెప్పింది.

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేశంలో మూడో దశ ఉద్ధృతి అనివార్యమేనని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల స్పష్టం చేసింది.

సెకండ్‌వేవ్‌ నుంచి పాఠాలను నేర్చుకొని మూడో దశను ఎదుర్కోవడానికి అందరూ సంసిద్ధంగా ఉండాలని పేర్కొంది. వైరస్‌లో మార్పులు, రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటున్న మ్యుటేషన్లపై సమర్థంగా పనిచేసేలా వ్యాక్సిన్ల ఫార్ములాలో అప్‌డేట్లు తీసుకురావడం అవసరమని నొక్కి చెప్పింది.

కేసులు ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాల్లోని ప్రభావిత జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి, పిల్లల్లో నమోదవుతున్న కేసుల సమాచారాన్ని కేంద్రం గురువారం ప్రత్యేకంగా సేకరించింది.

కేసుల సరళిలో గణనీయమైన మార్పులు కనబడితే వెంటనే సమాచారమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

యువత, పిల్లల్లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉన్న జిల్లాలపై ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన నిపుణుల బృందం ఓ కన్నేసి ఉంచింది.

మరోవైపు, థర్డ్‌వేవ్‌లో కరోనాతో పోరాడటానికి ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు బఫర్‌ స్టాక్‌ను సిద్ధం చేసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించిందని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Krishnapatnam Anandayya: Corona drug distribution with the permission of the government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X