ఇరుప్రాంతాలకు ఫౌండేషన్: లగడపాటి అమృతవాక్కులు
విజయవాడ: రాష్ట్రం రెండుగా విడిపోయినా ఇక తెలుగుజాతిగా కలిసే ఉండాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ఆకాంక్షించారు. తెలుగు ప్రజలు శాశ్వతంగా కలిసి ఉండాలని తాను కోరుకున్నానని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలుగు జాతి, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని భావించానన్నారు. ఇరుప్రాంతాల నాయకులూ రాజకీయాలు పక్కన పెట్టి, అంతా బాధ్యతలు చేపట్టాలన్నారు.
గతం గతః అన్నట్లుగా జరిగినదంతా చరిత్రగా వదిలేయాలని, అంతే తప్ప దానిని తిరగదోడి ఒకరిపై ఒకరు నెపాలు మోపుకోవద్దన్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు విభజనలో అందరికీ భాగం ఉందన్నారు. తెలుగు రాష్ట్ర ఐక్యత కోసం పాటుపడిన వారంతా తెలుగు ప్రజల ఐక్యత కోసం పాటు పడాలని హితవు పలికారు. తనవంతుగా తెలుగు ప్రజల ఐక్యత కోసం కృషి చేస్తానని, ఇందుకోసం ఇప్పటికే రాజగోపాల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించానని చెప్పారు.

ఈ ఫౌండేషన్ ద్వారా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న గాయాలను మాన్పించి, ద్వేషాలను తగ్గించి, బంధం, అనుబంధం పెంచేందుకు పాటుపడతానన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాను అనేక ప్రయత్నాలు చేశానని, విభజనను తన గెలుపుగానో, ఓటమిగానో భావించట్లేదన్నారు. విడిపోయేటప్పుడు బద్ధ శత్రువుల్లో కూడా బాధ ఉంటుందని, అలాగే అందరిలోనూ ఇప్పుడు ఎంతో కొంత బాధ ఉంటుందన్నారు.
అయితే, ఒకరినొకరు గాయాలు చేసుకోకుండా, ఎదుటివారి గాయాలు మాన్పించేందుకు దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటి వరకూ ప్రజల మధ్య రకరకాలుగా పోట్లాటలు, పోరాటాలు, అనేక భావోద్వేగాలు చోటు చేసుకున్నాయని, అనేక మందికి గాయాలయ్యాయని, అవన్నీ మానిపోయేట్లుగా పోరాటాలు, కొట్లాటలు గతంగా వదిలేసి ముందుకు ఎలా వెళ్లాలో ఆలోచించాలన్నారు. ఈ పోరాటాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఆస్తులు కోల్పోయారని, ఇవన్నీ సమసిపోయేట్లుగా భవిష్యత్తుపై దృష్టి సారించాలన్నారు.
తాను ఎన్నడూ స్వప్రయోజనాల కోసం, రాజకీయ ఎదుగుదల కోసం రాజకీయాలు చేయలేదన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకొన్నందున ఇకపై రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడబోనని, విభజన తప్పొప్పుల గురించి కూడా మాట్లాడనని స్పష్టం చేశారు. అయితే రాజకీయ నాయకులు సమాజంలో భాగం కాబట్టి వారితో తన సంబంధాలు కొనసాగుతాయన్నారు.












Click it and Unblock the Notifications