• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్జీబీటీ ఐడెంటిటీ: అబ్బాయిలు నెయిల్ పాలిష్ వేసుకున్నా, నగలు ధరించినా ‘గే’ అని అనుకోవాలా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆర్వే మల్హోత్రా

హరియాణా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో నివసించే ఆర్వే మల్హోత్రా (17) ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆత్మహత్య చేసుకున్నారు. అతను పదో తరగతి చదువుతున్నాడు. చనిపోతూ ఆయన తన స్కూల్ టీచర్ల మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఒక నోట్ రాశాడు. అయితే సూసైడ్ నోట్‌లో వచ్చిన ఆరోపణలను స్కూల్ యాజమాన్యం కొట్టిపారేసింది.

పోలీసుల విచారణకు తాము అన్ని విధాలా సహకరిస్తున్నామని పాఠశాల వర్గాలు చెబుతున్నాయి. ఆర్వే తల్లి ఆర్తి మల్హోత్రా కూడా అదే స్కూల్ లో టీచర్‌గా పని చేస్తున్నారు.

స్కూల్లో తోటి విద్యార్ధులు, సిబ్బంది వేధింపుల కారణంగా ఆర్వే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని, దాని కోసం మందులు కూడా వాడేవాడని ఆమె వెల్లడించారు.

ఆర్తి ప్రస్తుతం సింగిల్ మదర్. కొడుకును కూడా కోల్పోయిన ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. ఆర్వేకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

"అతను ఎక్కడికీ వెళ్లలేదు. నాతోనే ఉన్నాడు, నాకు ధైర్యం ఇస్తున్నాడు, నా బిడ్డ చాలా తెలివైనవాడు" అని ఆర్తి అన్నారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.

ఆర్వే గత ఏడాది కాలంగా డిప్రెషన్‌లో ఉన్నాడని, డిప్రెషన్‌కు సంబంధించిన మందులు తీసుకుంటున్నారని, తీవ్ర భయాందోళనలకు గురయ్యేవాడని ఆర్తి అన్నారు. అతని డిప్రెషన్‌కు కారణం స్కూలేనని ఆమె ఆరోపించారు. ఆర్వే కూడా తన మరణానికి స్కూలే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

ఎల్జీబీటీ కమ్యూనిటీ

స్కూల్ యాజమాన్యంపై తల్లి ఆరోపణలు ఏంటి?

"ఆర్వే‌ను స్కూల్‌లో వేధించేవారు. స్కూల్‌ పిల్లలు అతని జెండర్ విషయంలో రకరకాల ప్రశ్నలు వేసేవారు''అని ఆర్తి అన్నారు. స్కూల్‌లో ఆర్వే లైంగిక వేధింపులకు కూడా గురయ్యాడని ఆర్తి ఆరోపించారు.

దీని గురించి పాఠశాలలో తాము ఫిర్యాదు చేసినా వాటిని పట్టించుకోలేదని ఆమె అన్నారు. ఆర్వేకి గోళ్లకు రంగు వేసుకోవడం అంటే ఇష్టమని, టాప్స్ వేసుకోవడం, నగలు ధరించడాన్ని కూడా చాలా ఇష్టపడేవాడని, అయితే స్కూల్లో వీటిని అడ్డుకున్నారని ఆర్తి చెప్పారు.

"స్కూల్‌లో ఆడపిల్లల్లా ప్రవర్తించకూడదని ఆర్వేకు చెప్పాలని నాకు చెప్పేవారు. అబ్బాయిలే ఇలా నెయిల్‌ పెయింట్ వేసుకుని వస్తే ఇక అమ్మాయిలకు ఎలా వద్దని చెబుతాం అని టీచర్లు అనేవారు'' అని ఆర్తి వెల్లడించారు.

ఆర్వే తల్లి ఆర్తి మల్హోత్రా

చేతికొచ్చిన కొడుకు....

ఆర్తి మల్హోత్రా సింగిల్ మదర్. తాను ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, భర్తను వదిలి తల్లిగారింటికి చేరానని ఆర్తి వెల్లడించారు. ఆర్వే తన తండ్రిని ఇంత వరకు చూడలేదని, వాడికి తల్లీ తండ్రీ తానేనని ఆమె అన్నారు.

ఆర్వే జెండర్ ఐడెంటిటీ గురించి చెబుతూ "ఆర్వే అబ్బాయి. తాను ఇంట్లో వంటపనులు చేయకూడదని ఎప్పుడూ అనుకోలేదు. నాకు టీ పెట్టి ఇచ్చేవాడు. టిఫిన్ తయారు చేసేవాడు. తన దుస్తులు తానే ఉతుక్కునే వాడు. నన్ను జాగ్రత్తగా చూసుకునేవాడు'' అని ఏడుస్తూ చెప్పారు ఆర్తి.

''జెండర్ విషయంలో వాడిని వేధించారు, అవమానించారు. నేనిలా ఉన్నానని చాలామంది అంటున్నారు. అది నిజమేనా అడిగేవాడు. తన మీద తనకే అనుమానం కలిగేలా చేశారు. తన ఐడెంటిటీ గురించి వాడిలో ఆందోళన పెరిగింది. ఎదుగుతున్న పిల్లాడు ప్రాణాలు తీసుకున్నాడు'' అన్నారు ఆర్తి.

స్కూల్ ప్రిన్సిపాల్ సూర్జిత్ ఖన్నా

స్కూల్ ప్రిన్సిపాల్ ఏమంటున్నారు?

అయితే ఈ ఆరోపణలను స్కూల్ ప్రిన్సిపాల్ సుర్జిత్ ఖన్నా కొట్టిపారేశారు.

''ఆర్వే చనిపోవడం బాధాకరం. ఆ పిల్లవాడు పదేళ్లు ఈ పాఠశాలలో చదివాడు. ఇక్కడంతా అతనిని సొంత బిడ్డలా ప్రేమిస్తారు. ఎప్పుడూ గొడవ చేసేవాడు కాదు. తనపై జరుగుతున్న వేధింపుల గురించి మాకెప్పుడూ చెప్పలేదు'' అన్నారు ఖన్నా.

"గత సంవత్సరం అతను మాకు ఫిర్యాదు చేసినప్పుడు మేం దాన్ని పరిష్కరించాం. వాళ్ల అమ్మ చేసిన ఆరోపణల్లో నిజం లేదు. మేం పోలీస్ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాం'' అన్నారు ప్రిన్సిపాల్ ఖన్నా.

ఆర్వే సూసైడ్ నోట్‌లో పేరు ఉన్న ఉపాధ్యాయుడిని, ఇదే స్కూల్‌లో పని చేస్తున్న ఆర్వే తల్లి ఆర్తి మల్హోత్రాను సెలవుపై పంపామని ప్రిన్సిపాల్ సుర్జిత్ ఖన్నా తెలిపారు.

యుక్తవయసులో ఇలా జెండర్ ఐడెంటిటీ సమస్యతో పోరాడుతున్న పిల్లల మానసిక స్థితిని, వారు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు ఎలా ఉంటాయన్న విషయం తెలుసుకోవడానికి సైకాలజిస్ట్ గగన్‌దీప్ కౌర్‌తో బీబీసీ మాట్లాడింది.

చాలామంది పిల్లలు కౌమారదశలో తరచుగా జెండర్ ఐడెంటిటీ సమస్యతో పోరాడుతుంటారని, ఈ గందరగోళం చాలాకాలంగా ఉందని , ఇలాంటి పిల్లలకు సలహాలు ఇచ్చేవారుండరని గగన్‌దీప్ కౌర్ అన్నారు.

''సీబీఎస్‌ఈ స్కూల్స్‌లో కౌన్సెలర్లు ఉండాలని 15 ఏళ్ల కిందటే చెప్పారు. కానీ నేటికీ దిల్లీలోని చాలా స్కూళ్లకు కౌన్సెలర్లు లేరు. ఉన్నవారికి కూడా అంత పరిజ్ఞానం లేదు. దీనివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. డిప్రెషన్ బాధితులుగా మారుతున్నారు. ఇలాంటి పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్న సందర్భాలు, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చూస్తున్నాం" అన్నారామె.

సైకాలజిస్ట్ గగన్‌దీప్ కౌర్

2019లో యునెస్కో నిర్వహించిన పరిశోధనా గణాంకాల ప్రకారం, ఎల్జీబీటీ కమ్యూనిటీలో మూడవ వంతు మంది పిల్లలు వేధింపుల కారణంగా పాఠశాలను, చదువులను విడిచిపెట్టాల్సి వస్తుంది.

"వేధింపులను అరికట్టడానికి బలమైన చట్టాలు, వాటిని అమలు చేయడమే ఏకైక మార్గం, స్త్రీ లక్షణాలు ఉన్న పిల్లలు బడి మానేయడం చాలా తరచుగా జరుగుతుంది'' అని నాజ్ ఫౌండేషన్‌లో పని చేస్తున్న సామాజిక కార్యకర్త అంజలి గోపాలన్ అన్నారు.

పాఠశాల స్థాయిలోనే ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, మన చట్టాలు కూడా జెండర్ న్యూట్రల్ కాదని, ప్రతి ఒక్కరినీ తమ పరిధిలోకి తీసుకోవడం లేదని, ఈ సమస్యపై ఎలాంటి చట్టాలు చేయాలో ప్రభుత్వాలు ఆలోచించాలని ఆమె అన్నారు.

పాఠశాలలో వేధింపులపై చట్టంలో ఏముంది ?

స్కూల్ వేధింపులను నిరోధించడానికి భారతదేశంలో ఇంకా చట్టం లేదు. 2007లో రాఘవన్ కమిటీ నివేదిక ర్యాగింగ్, వేధింపులను మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించింది.

2015లో, సీబీఎస్ఈ ర్యాగింగ్, వేధింపులను నిరోధించడానికి యాంటీ-బుల్లీయింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీని కింద తీవ్రమైన కేసులలో స్కూలు బహిష్కరణతో సహా అనేక చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
LGBT identity: Should boys be considered 'gay' if they wear nail polish or jewellery?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X