విమాన కాక్‌పిట్‌లోకి స్నేహితురాలు:ఆ పైలట్‌పై వేటు, ఎయిరిండియాకు రూ. 30 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో ఓ పైలట్ తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించిన ఘటనలో.. ఇటు ఎయిరిండియాకు, అటు పైలట్‌పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ(DGCA) చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈ వ్యవహారంలో పైలట్‌పై మూడు నెలల సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు, ఎయిరిండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించింది.
ఈ అంశాన్ని నివేదించడంలో జాప్యం జరిగిందంటూ ఎయిరిండియా సీఈవో క్యాంబెల్ విల్సన్ తోపాటు ఎయిరిండియా భద్రత, రక్షణ-నాణ్యత విభాగాధిపతికి కూడా ఇటీవల డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతకుముందు ఈ ఘటనపై విచారణ ముగిసేంత వరకు ఆ విమానంలో ఉన్న సిబ్బందిని విధుల నుంచి తప్పించాలని ఎయిరిండియా సంస్థకు స్పష్టం చేసింది. విచారణ అనంతరం ఈ మేరకు డీజీసీఏ చర్యలు చేపట్టింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఢిల్లీ-దుబాయ్ విమానంలో.. ఓ పైలట్ ప్రయాణికురాలిగి విమానం ఎక్కిన తనస్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లడమే గాక, ప్రయాణ సమయమంతా ఆమెను అక్కడే కూర్చోబెట్టుకున్నాడు. ఢిల్లీ చేరుకునేంత వరకు అంటే దాదాపు 3 గంటలపాటు ఆ మహిళ కాక్‌పిట్‌లోనే ఫస్ట్ అబ్జర్వర్ సీటులో కూర్చున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ ఘటనపై క్యాబిన్ సభ్యుల్లో ఒకరు డీజీసీఏకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. తన స్నేహితురాలికి కాక్‌పిట్‌లోనే భోజనం అందజేయాలని, అన్ని మర్యాదలు చేయాలని విమాన సిబ్బందిని పైలట్ ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు అభ్యంతరం తెలిపిన సిబ్బందితో పైలట్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ కఠిన చర్యలకు ఉపక్రమించింది.
కొద్ది నెలల క్రితం న్యూయార్క్-న్యూఢిల్లీ విమానంలో మూత్ర విసర్జన ఘటన తర్వాత ఈ ఎయిర్‌లైన్స్ వార్తల్లో నిలిచింది. డీజీసీఏ మూడు నెలల పాటు పైలట్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. నవంబర్ 26, 2022న జరిగిన మూత్ర విసర్జన ఘటనకు సంబంధించి ఎయిర్‌లైన్స్ ఇన్-ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్‌కు రూ. 3 లక్షల జరిమానా కూడా విధించింది.












Click it and Unblock the Notifications