కేంద్ర మరో కీలక నిర్ణయం: ఇక ఆక్సిజన్ వైద్యానికి మాత్రమే, పరిశ్రమలకు మినహాయింపు లేదు
న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆక్సిజన్ వినియోగానికి కొన్ని పరిశ్రమలకు ఇచ్చిన మినహాయింపును కూడా తొలగించింది.
ఇకపై అన్ని ఉత్పత్తి కేంద్రాల్లో తయారయ్యే ద్రవ ఆక్సిజన్‌ను కేవలం వైద్య అవసరాల కోసమే వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న నిల్వలతోపాటు ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను వైద్య అవసరాల కోసం ప్రభుత్వానికే సరఫరా అయ్యేట్లు చూడాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఆస్పత్రుల్లోని రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు ఏప్రిల్ 22 నుంచి పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ సరఫరాను బంద్ చేయాలని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. తొమ్మిది రకాల పరిశ్రమలకు మినహా మిగిలిన వాటికి ఆక్సిజన్ సరఫరా చేయకూడదని వెల్లడించింది. అయినా పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.

అన్ని ఉత్పత్తి కేంద్రాల ద్రవ ఆక్సిజన్‌ను వైద్య అవసరాలకే వినియోగించాలని కేంద్ర స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ఇప్పటికే కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలోని అన్ని వనరులను వినియోగించుకోవడంతోపాటు, విదేశాల నుంచి కూడా ఆక్సిజన్ ను భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.
కాగా, దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. మూడున్నర లక్షలకుపైగా ఒక్క రోజులోనే కేసులు నమోదతుండటం, 2వేలకు పైగా మరణాలు చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీలోనే ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఆ రాష్ట్రాలకు భారీ ఎత్తున ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications