దేశంలో మళ్ళీ లాక్ డౌన్ టెన్షన్ : భారీగా కరోనా కేసులు , హోరాహోరీగా ఎన్నికలు
భారతదేశంలో మరోమారు కరోనా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన విషయం తెలిసిందే. ఇక పోతే ఇదే సమయంలో నాలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలు కరోనా వ్యాప్తికి కారణమవుతాయేమో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో ఎన్నికలు వాయిదా వేసి లాక్ డౌన్ విధిస్తారా అన్న చర్చ జరుగుతుంది .
Recommended Video

భారీగా పెరుగుతున్న కరోనా కేసులు .. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు ,నైట్ కర్ఫ్యూ లు
కరోనా రోజువారీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలలో లాక్ డౌన్ విధించారు. పంజాబ్ వంటి రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ వంటి పలు రాష్ట్రాలు మరోమారు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కేసులు ఇలా పెరుగుతూ పోతే మళ్లీ లాక్డౌన్ పెడతారా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఏడాది ఇదే సమయంలో కరోనా మహమ్మారి భారతదేశంలో విజృంభించడం, నియంత్రించడానికి లాక్ డౌన్ విధించడం జరిగింది.

దేశంలో ఎన్నికల హడావిడి .. జోరుగా ప్రచారాలు .. కరోనా వ్యాప్తి టెన్షన్
ఇప్పుడు కూడా మళ్లీ దేశవ్యాప్త లాక్ డౌన్ విధిస్తారేమో అన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావిడి కూడా కొనసాగుతోంది. నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నామినేషన్లు, ప్రచారం హడావిడి అంతా ఇంతా కాదు. ఇక ప్రచార సభలకు వేలాది మంది ప్రజలు ఒకటే చోట హాజరవుతున్నారు. ఈ సమయంలో కరోనా వైరస్ ప్రబలితే దానికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

ఎన్నికల రాష్ట్రాలు తమిళనాడు , కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు
ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు , కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది . ఇక తమిళనాడు , కేరళ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సమయంలో అక్కడ ఎన్నికలు జరిగితే, కేసుల సంఖ్య ఇదేవిధంగా పెరిగితే కరోనా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ యంత్రాంగ ఎంత మొత్తుకున్నా సాధ్యం కాని పరిస్థితి కనిపిస్తుంది.

పోటీలో ఉన్న అభ్యర్థులను వదలని కరోనా .. దేశంలో లాక్ డౌన్ పై మళ్ళీ చర్చ
తాజాగా తమిళనాడు రాష్ట్రంలో వేలాచేరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న మక్కల్ నీది మయ్యం పార్టీ నాయకుడు సంతోష్ బాబుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది . ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఇక అక్కడ కరోనా తీవ్రరూపం దాల్చితే దానిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఇక మహారాష్ట్రలో దారుణమైన పరిస్థితులను బట్టి, అలాంటి పరిస్థితులు మిగతా రాష్ట్రాలలో ఏర్పడితే భారతదేశంలో కరోనాను అడ్డుకోవడం కష్టసాధ్యంగా మారుతుంది. కాబట్టి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో కరోనా నియంత్రణకు ప్రయత్నం చేస్తున్న సర్కార్ కేసులు ఇదేవిధంగా పెరిగితే మరేదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోమారు లాక్ డౌన్ విధింపు ఇప్పుడు చర్చనీయాంశం అయింది .












Click it and Unblock the Notifications