కర్ణాటకలో ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు ఇవే: రంగంలో స్టార్ హీరో భార్య, బొమ్మై
Lok Sabha election 2024 phase 3: మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. ఈ నెల 7వ తేదీన మంగళవారం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 94 నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. కిందటి నెల 19వ తేదీన 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. 26వ తేదీన 13 రాష్ట్రాల్లో 88 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మొత్తంగా 190 సీట్లల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మూడో విడత కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలను పూర్తి చేసింది. కర్ణాటక, అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ దామన్, గోవా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లల్లో మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమౌతుంది.
కర్ణాటకలో మొత్తం 2,59,17,493 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,29,48,978 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,29,66,570 మంది, ట్రాన్స్‌జెండర్లు 1945 మంది ఉన్నారు. వాళ్లంతా నేడు జరగబోయే ఓటింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
206 మంది పురుషులు, 21 మంది మహిళలు సహా మొత్తంగా 227 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారికోసం 28,269 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి మనోజ్ కుమార్ మీనా తెలిపారు. 1.45 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధి నిర్వహణలో మోహరింపజేశామని చెప్పారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా 35,000 మంది పోలీసులు, 65 కంపెనీల సెంట్రల్ పారామిలటరీ, ఆర్మ్డ్ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా..కర్ణాటక దక్షిణ ప్రాంత జిల్లాల్లోని 14 నియోజకవర్గాలకు కిందటి నెల 26వ తేదీన పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. కర్ణాటక ఉత్తర ప్రాంతంలోని మిగిలిన 14 స్థానాలకు మూడో విడతలో అంటే ఈ నెల 7వ తేదీన ఓటింగ్ నిర్వహించనున్నారు.
చిక్కోడి, బెళగావి, బాగల్‌కోట్, బిజాపూర్, కలబురగి, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారి, హవేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరుగనుంది. బీజేపీ అభ్యర్థులుగా మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై- హవేరి, బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర- శివమొగ్గ నుంచి పోటీలో ఉన్నారు.
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి-ధార్వాడ, విశ్వేశ్వర హెగ్డే కగేరీ- ఉత్తర కన్నడ నుంచి బీజేపీ తరఫున పోటీలో నిలిచారు. శివమొగ్గ స్థానం నుంచి స్టార్ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతా రాజ్ కుమార్.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప ఇండింపెండెంట్‌గా పోటీలో ఉండటం ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications