లోక్‌సభ బరిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్, యూసుఫ్ పఠాన్: టికెట్లు ఇచ్చిన జాతీయ పార్టీ
Yusuf Pathan: భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్.. రాజకీయ అరంగేట్రం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతోన్నారు. అన్నీ కలిసి వస్తే- గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ తరహాలో పార్లమెంట్‌లో అడుగు పెడతారు. బీజేపీ తరఫున గౌతమ్ గంభీర్ లోక్‌సభకు, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున హర్భజన్ సింగ్ రాజ్యసభకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.
ఇప్పుడు అదే జాబితాలో యూసుఫ్ పఠాన్ కూడా చేరారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బహ్రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతోన్నారాయన. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ కొద్దిసేపటి కిందటే ప్రకటించారు.

మొత్తం 42 లోక్‌సభ స్థానాలకూ అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు ప్రకటించిన వెంటనే మమత బెనర్జీ.. ఈ జాబితాను విడుదల చేశారు. కోల్‌కతలో ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించారు మమత బెనర్జీ. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో ఎవ్వరితోనూ పొత్తులు లేవని తేల్చి చెప్పారు. ఒంటరిగా పోరాడబోతోన్నామని స్పష్టం చేశారు.
ఈ జాబితాలో యూసుఫ్ పఠాన్‌తో పాటు సిట్టింగ్ ఎంపీ మహువా మొయిత్ర పేర్లు ఉన్నాయి. యూసుఫ్ పఠాన్- బహ్రాంపూర్, మహువా మొయిత్ర- కృష్ణానగర్ సీట్లు ఖరారయ్యాయి. మరో సిట్టింగ్ ఎంపీ మిమి చక్రవర్తికి టికెట్ దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ లభించడానికి గల కారణాల్లో ఒకటైన ఖేలో హొబె పాటను పాడిన గాయకుడు దేబాన్షు భట్టాచార్యకు టికెట్ ఇచ్చారు.
ప్రముఖ నటి రచన బెనర్జీ.. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నారు. గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించారు. నేను ప్రేమిస్తున్నాను, మావిడాకులు, అభిషేకం, బావగారు బాగున్నారా, పిల్ల నచ్చింది, లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాల్లో హీరోయిన్‌గా మెరిశారు.












Click it and Unblock the Notifications