రూ. లక్షల్లో లంచం తీసుకుంటున్న జ్యోతి, మ్యాటర్ లీక్ తో లోకాయుక్త ఎంట్రీ !
మంగళూరు/ బెంగళూరు: లోకాయుక్త అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కర్ణాటక. అవినీతి అధికారులు, రాజకీయ నాయకుల భరతం పట్టడంలో కర్ణాటక లోకాయుక్త అధికారులు ముందు వరసులో ఉంటారు. కర్ణాటకలో లోకాయుక్త అంటే అవినీతి అధికారులతో పాటు పలు పార్టీల అవినీతి రాజకీయ నాయకులకు హడల్ అనే విషయం కర్ణాటక రాజకీయాలు తెలిసిన వాళ్లకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కర్ణాటకలోని మంగళూరులోని ఓ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన కన్వీనర్ ఐదు లక్షల రూపాయల లంచం తీసుకున్న ఆరోపణలపై లోకాయుక్త పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. లోకాయుక్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీఎస్ సైమన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలు వెళ్లడించారు.

అరెస్టు చేసిన నిందితురాలిని మంగళూరు శివార్లలోని బజ్పేలోని నిరంజన్ స్వామి ఎయిడెడ్ పాఠశాల కన్వీనర్ జ్యోతి పూజారిగా గుర్తించారు.
ఈ అధికారిక ప్రకటన ప్రకారం అదే పాఠశాలకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు శోభా రాణి తన పెన్షన్ పత్రాలపై సంతకం చేయమని మేడమ్ జ్యోతి పూజారిని అభ్యర్థించారు.
పెన్షన్ పత్రాలకు ఆమోదం కోసం ప్రాంతీయ విద్యా అధికారికి పంపారు. దరఖాస్తును స్వీకరించలేదని, నిందితురాలు జ్యోతి పూజారి శోభా రాణిని రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. అనంతరం లోకాయుక్త పోలీసులు జ్యోతి పూజారి రూ. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసి డబ్బు స్వాధీనం చేసుకున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈ తతంగం వెనుక ఇంకా ఎంత మంది ఉన్నారు అంటూ అధికారులు ఆరా తీస్తున్నారని తెలిసింది. మొత్తం మీద ఎయిడెడ్ స్కూల్ లో జరుగుతున్న గోల్ మాల్ వ్యవహారం బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications