శ్రీరాముడు అసలు దశరథుడి కుమారుడే కాదు: మా కుటుంబంలో జన్మించాడు: బీజేపీ మిత్రపక్ష పార్టీ చీఫ్
లక్నో: కోట్లాదిమంది హిందువులు నిత్యం పూజించే శ్రీరామచంద్రుడు.. దశరథ మహారాజు కుమారుడని రామాయణం చెబుతోంది. ఇక్ష్వాకు వంశంలో జన్మించాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. రఘువంశ తిలకుడిగా మనకు తెలుసు. ఈ వంశస్తుల కుల గురువు వశిష్ట మహర్షి. హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘువు, దశరథుడు, శ్రీరామచంద్రుడు చక్రవర్తులయ్యారు. రాజ్యాలను పరిపాలించారు. ఈ భూమి మీద నడయాడిన దేవుళ్లుగా నిలిచిపోయారు. యుగాలు మారినా చరిత్ర వారిని విస్మరించదు.

కొత్త వివాదానికి తెర తీసిన సంజయ్ నిషాద్..
శ్రీరామచంద్రుడి వంశంపై ఇప్పుడు కొత్తగా బాంబు పేల్చారు నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్. శ్రీరాముడు దశరథ మహారాజు కుమారుడు కాదని తేల్చి చెప్పారు. ఇక్ష్వాకు కులంలో ఆయన జన్మించలేదని స్పష్టం చేశారు. శ్రీరాముడు అసలు దశరథుడి కుమారుడే కాదంటూ కొత్త వివాదానికి తెర తీశారు. శ్రీరాముడు తమ నిషాద్ కుటుంబంలో జన్మించారని, ఆయన నిషాద్ కుటుంబీకుడని చెప్పారాయన. నిషాద్ పార్టీ.. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా కొనసాగుతోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

రుష్య శృంగి కుమారుడిగా..
ఈ ఉదయం ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంజయ్ నిషాద్ మాట్లాడారు. శ్రీరాముడు తమ నిషాద్ కుటుంబంలో జన్మించాడని చెప్పారు. రుష్య శృంగి కుమారుడని స్పష్టం చేశారు. దశరథ మహారాజుతో పుత్ర కామేష్ఠి యాగం జరిపించిన రిష్య శృంగి కుమారుడే శ్రీరామచంద్రుడని, ఆయనను దశరథుడి తనయుడిగా తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. యాగం ఫలాన్ని స్వీకరించడం వల్ల ఎక్కడైనా పిల్లలు పుడతారా? అని ప్రశ్నించారు.

ప్రసాదం తినడంతో గర్భం దాల్చుతారా?
దశరథుడికి పిల్లలు లేరని రిష్య శృంగితో యాగం చేయించారని గుర్తు చేశారు. యాగ ఫలంగా ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకోవడం వల్లే దశరథ మహారాజు ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భం దాల్చారని చెప్పారు. ప్రసాదం తినడం వల్ల ఎవరైనా గర్భం దాల్చుతారా? అని సంజయ్ నిషాద్ ప్రశ్నించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న సమయంలో ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తోన్నాయి.
ఒవైసీ డిమాండ్..
అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు కుమారుడా? లేక నిషాద్ వంశస్తుడా? అనేది తేల్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్‌ను దీన్ని తేల్చాలని సవాల్ విసిరారు. డీఎన్ఏ టెస్ట్‌లు చేయడంలో మోహన్ భగవత్ నిష్ణాతుడని, శ్రీరాముడి వంశం ఏమిటో స్పష్టం చేయాలని అన్నారు. తమ మిత్ర పక్షం నిషాద్ పార్టీ అధినేత చేసిన ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు స్పందించాలని ఒవైసీ అన్నారు.
Recommended Video

ఓట్ల కోసమే..
సంజయ్ నిషాద్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ కూడా స్పందించింది. వెనుకబడిన తరగతుల ఓటుబ్యాంకు కోసమే బీజేపీ నాయకులు కొత్తరకం ఎత్తుగడ వేశారంటూ కాంగ్రెస్ నాయకుడు అన్షు అవస్థి మండిపడ్డారు. శ్రీరామచంద్రుడి చుట్టూ మరోసారి రాజకీయాలు చేసి, అధికారంలోకి రావడానికి బీజేపీ చేస్తోన్న ప్రయోగంగా ఆయన అభివర్ణించారు. నిషాద్ కుటుంబీకులకు సంబంధించిన బోట్లను బీజేపీ నాయకులు ధ్వంసం చేసిన సమయంలో సంజయ్ నిషాద్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications