వాసన, రుచి కోల్పోతున్నారు: కరోనా లక్షణాల జాబితాలోకి మరో రెండు అంశాలు
న్యూఢిల్లీ: కరోనావైరస్ లక్షణాలకు సంబంధించిన జాబితాలో మరో రెండు అంశాలను చేర్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కరోనా కేసులు క్రమంగా భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో లక్షణాలను పెంచడంతో కరోనా కేసులను గుర్తించడం సులభమవుతుందని, నిరోధక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

చాలా మంది రెండు లక్షణాలు కూడా..
చాలా మంది కరోనా బాధితులు వాసన చూసే శక్తిని, రుచి చూసే శక్తిని కోల్పోవడంఅనే రెండు లక్షణాలు గుర్తించింది. ఈ రెండు లక్షణాలను కూడా కరోనా పరీక్షలు జరిపేందుకు ఆధారంగా తీసుకునే అంశాన్ని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) పరిశీలిస్తోంది. కరోనాపై ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్.. ప్రపంచ వ్యాప్తంగా లభ్యమవుతున్న వైద్య గణాంకాలను పరిగణలోకి తీసుకుని దీనిపై అధ్యయనం చేసింది.

ఈ రెండింటినీ కూడా జాబితాలోకి..
కాగా, దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలను చేసేందుకు 13 లక్షణాలను పరిగణిస్తున్నారు. ఈ జాబితాలో రుచి, వాసన శక్తిని కోల్పోయే లక్షణాలను చేర్చనున్నారు. రుచి, వాసన కోల్పోవడాన్ని కరోనా వైరస్ ముఖ్య లక్షణాలుగా ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాతోపాటు పలు యూరోపియన్ దేశాలు కూడా ఈ అంశాన్ని ఏప్రిల్ నెలలోనే గుర్తించాయి. పలు దేశాలు కరోనా లక్షణాల జాబితాలో ఈ రెండింటినీ చేర్చి పరీక్షలు జరుపుతున్నాయి.
Recommended Video

మొదట 11, తర్వాత 13.. ఇప్పుడు మరో రెండు
దేశంలో కరోనా పరీక్షలకు ఆధారంగా తీసుకోవాల్సిన 11 లక్షణాలను ఐసీఎంఆర్ తొలిసారిగా జనవరిలో ప్రకటించింది. ఆ తర్వాత డయేరియా(విరేచనాలు), వాంతులను కూడా ఆ జాబితాలో చేర్చింది. ప్రస్తుతం కరోనా లక్షణాల జాబితాలో ఉన్న అంశాలను పరిశీలించినట్లయితే.. జ్వరం, దగ్గు, డయేరియా, వాంతులు, కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, రక్తంతో కూడిన దగ్గు, ఒళ్లు నొప్పులు, గొంతునొప్పి, ఛాతి నొప్పి, ముక్కు కారటం, కఫం ఉన్నాయి. వీటిలో ఒకటి లేదా అంతకుమించి లక్షణాలున్నవారికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిస్తున్నారు. అయితే, విపరీతమైన నీరసం, కండరాల నొప్పులు, చలిగా ఉండటం వంటి లక్షణాలను కూడా ఈ జాబితాలో చేర్చాలని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications