ఒకరి ముక్కు కోశారు.. మరొకరి కాళ్లు విరగ్గొట్టారు!
రాజస్థాన్‌లోని బాడ్మేర్ జిల్లాలో ఒక ప్రేమ వివాహం రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. ఈ గొడవ కాస్తా ముదిరి ఒకరి ముక్కు కోయడం, మరొకరి కాళ్లు విరగ్గొట్టే వరకు వెళ్లింది. బుధవారం రాత్రి జరిగిన ఈ హింసాత్మక ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అసలు ఏం జరిగిందంటే?
బాడ్మేర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన శ్రవణ్ సింగ్(25) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి యువతి కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. పెళ్లి జరిగినప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రాణహాని భయంతో శ్రవణ్ సింగ్ తన భార్యతో కలిసి గుజరాత్‌లో నివాసం ఉంటున్నాడు.

ఘటన ఎలా జరిగిందంటే?
బుధవారం సాయంత్రం శ్రవణ్ సింగ్ సోదరుడు యూకే సింగ్(35) పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. యువతి బాబాయ్ ధర్మ్ సింగ్(50), అతని అనుచరులు మాటువేస దాడి చేశారు. దాడి చేసిన వారు పదునైన ఆయుధంతో యూకే సింగ్ ముక్కును కోసేశారు. రక్తపు మడుగులో ఉన్న ఆయన ఎలాగోలా ప్రాణాలతో ఇంటికి చేరుకున్నాడు. అతని పరిస్థితి చూసి ఆగ్రహించిన యూకే సింగ్ కుటుంబ సభ్యులు వెంటనే యువతి ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలో యువతి బాబాయ్ ధర్మ్ సింగ్‌పై దాడి చేసి ఆయన కాలు విరగ్గొట్టారు.
కేసులు నమోదు
తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే గుడామలాని ఆస్పత్రికి తరలించారు. యూకే సింగ్‌ను మెరుగైన చికిత్స కోసం సాంచోర్‌కు, ధర్మ్ సింగ్‌ను జోధ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.












Click it and Unblock the Notifications