7వ తేదీన పట్టాలెక్కనున్న మినీ వందేభారత్
వందే భారత్ రైళ్లు భారతీయ రైల్వేకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అద్భుతమైన సౌకర్యాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ఈ రైళ్లు ఎక్కువ ప్రజాదరణను పొందుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 46 వందే భారత్ సర్వీసులు నడుస్తున్నాయి. ఈనెల 7వ తేదీన రెండో మినీ వందేభారత్ లక్నో- అయోధ్య- గోరఖ్‌పూర్ మధ్య ప్రారంభం కాబోతోంది.
ఆదాయంపై అంచనా కోసం : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 16 కోచ్‌లు ఉంటే, మినీ వెర్షన్‌లో 8 కోచ్‌లు ఉంటాయి. ప్రస్తుతం మినీ వెర్షన్ చెన్నై నుంచి కోయంబత్తూరు మధ్య నడుస్తోంది. షార్ట్ కట్ మార్గాల్లో వీటిని తిప్పడంవల్ల ఆదాయం ఎలా ఉంటుంది? అనే అంచనా కోసం అధికారులు దీన్ని తిప్పుతున్నారు. రెండో మినీ వందే భారత్ ను ఈనెల 7వ తేదీన ప్రారంభించబోతున్నారు.

ఛార్జీలు ఫైనల్ కాలేదు : మినీ వెర్షన్ ఛార్జీలు ఇంకా ఫైనల్ కాలేదు. ఈ రైలు ప్రారంభం కావడానికి రెండురోజుల ముందు వీటిని ఖరారు చేయబోతున్నారు. లక్నో- అయోధ్య- గోరఖ్‌పూర్ మధ్య ఉన్న 302కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల్లోనే చేరుకోనుంది. గరిష్ట వేగం 160kmph అయినప్పటికీ, ట్రాక్‌పై 110kmphతోనే నడవనుంది.
ఇతర రైళ్లు : అరుణాచల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22411) గోరఖ్‌పూర్- లక్నో మధ్య ఆదివారం, బుధవారాల్లో నడుస్తుంది. 270 కిలోమీటర్ల దూరాన్ని (గోండా జంక్షన్ ద్వారా) 4 గంటల 35 నిమిషాల సమయంలో కవర్ చేస్తుంది. సప్ట్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12557), గోరఖ్‌ధామ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12555) రైళ్లకు మాత్రం 4 గంటల 50 నిమిషాల సమయం పడుతోంది. ఈ సమయాన్ని మినీ వందే భారత్ మరింత తగ్గించబోతోంది.
100 ఆక్యుపెన్సీతో రికార్డ్ : వందే భారత్ రైళ్లు అరుదైన ఘనతను సాధించాయి. 2022 ఏప్రిల్ నుంచి 2023 జూన్ మధ్య ఇవి 100 శాతం ఆక్యుపెన్సీతో తిరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో మొత్తం 2,140 ట్రిప్పులు తిరగ్గా, 25.20 లక్షల మంది ప్రయాణికులను ఇవి తమ గమ్యస్థానాలకు చేర్చాయి. ఇతర రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్ల వేగం ఎక్కువగా ఉంటుంది. సగటున ప్రయాణ సమయంలో గంట ఆదా అవుతుండటంతో ప్రజలంతా వీటిల్లోప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారు.












Click it and Unblock the Notifications