మేక పొలంలోకి వచ్చిందని బాలుడి సజీవదహనం
ససారం: బీహార్ రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లాలో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఓ మహాదళిత వర్గానికి చెందిన పదిహేనేళ్ల బాలుడ్ని అగ్రవర్ణానికి చెందిన నలుగురు వ్యక్తులు సజీవ దహనం చేశారు. ఆ బాలుడికి చెందిన ఓ మేక తమ పొలంలోకి వచ్చి మేసిందని ఆగ్రహించిన దుర్మార్గులు ఈ దురాఘతానికి పాల్పడ్డారు. కారకట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్పూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుందీ ఘటన.
మోహన్పూర్ గ్రామంలో పలుకుబడి కలిగిన కుంకుమ్ సింగ్ అనే వ్యక్త తన ముగ్గురు సహచరులతో కలిసి జీతురాం ఇంట్లోకి ప్రవేశించి అతడ్ని బయటికి లాగి కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. ఆ బాలుడికి చెందిన ఓ మేక తమ పొలంలో ప్రవేశించిందనే నెపంతో కుంకుమ్ సింగ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అంతకుముందు బాలుడ్ని తీవ్రంగా చితకబాదారు. అతడు తన ఇంటికి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటబడి ఈ దారుణానికి పాల్పడ్డారు.

అతనికి నిప్పంటించిన కుంకుమ్ సింగ్, అతని సహచరులు అక్కడ్నుంచి పరారయ్యారు. గమనించిన స్థానికులు బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. 90శాతం కాలినగాయాలతో చికిత్స పొందుతు బాలుడు మృతి చెందాడని బిక్రమ్‌గంజ్ ఎస్‌డిపిఓ అశోక్ కుమార్ దాస్ తెలిపారు.
మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు కుంకుమ్ సింగ్, అతని ముగ్గురు సహచరులపై కేసు నమోదు చేసినట్లు దాస్ చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అశోక్ కుమార్ దాస్ తెలిపారు. తనిఖీలు చేపట్టిన్లు దాస్ చెప్పారు. కాగా, ఇప్పటి వరకు ఈ కేసులో ఎవర్నీ అరెస్ట్ చేయలేదు.












Click it and Unblock the Notifications