Mahakumbh Mela 2025: కళ్ళు చెదిరే అద్భుత దృశ్యం - చారిత్రక ఘట్టం..!!
మహాకుంభమేళా లో చారిత్రక ఘట్టం ఆవిష్కారమైంది. నాగ సాదువులు పెద్ద సంఖ్యలో కుంభ మేళాకు తరలి వచ్చారు. కేవలం మూడు రోజుల సమయంలో రికార్డు స్థాయిలో ఆరు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. కేవలం ఒక్క మకర సంక్రాంతి రోజున దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. పలు పీఠాల అధిపతులు ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న భక్తులతో ప్రయాగ్ రాజ్ ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతోంది.
కుంభమేళాకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అంచనాల కంటే భారీ స్థాయిలో త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మూడు రోజుల్లోనే 6 కోట్ల మందికిపైగా పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక్క మకర సంక్రాంతి రోజునే (మంగళవారం) 3.5 కోట్ల మందికిపైగా వచ్చినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అదే రోజున అఖాడాలు, ఆధ్యాత్మిక పీఠాల అధిపతులు, నాగా సాధువులు, సంతులు తొలి రాజస్నానం (షాహి స్నాన్)లో పాల్గొన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణీ, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖాఖా సాధువులు త్రివేణీ సంగమంలో తొలి స్నానాలు ఆచరించారు.

అఖాడా సాధువుల అగమనం వేళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ నుంచి పుష్పవర్షం కురిపించింది. ఇక, తొలిరోజైన సోమవారం 1.65 కోట్ల మందికిపైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించినట్లు అధికారిక లెక్కలు వెలువడ్డాయి. మంగళవారం 3.5 కోట్లు, బుధవారం కూడా సుమారు కోటి మంది మంది దాకా భక్తులు త్రివేణి సంగమానికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య అయిన జనవరి 29న రానుంది. ఆ రోజు ఏకంగా 10 కోట్ల మంది కంటే అధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
వచ్చే నెల 26న శివరాత్రి తో మహా కుంభమేళా ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. అందులో 20 శాతం మంది విదేశీయులు ఉంటారని అంచనా వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు 13 వేల ప్రత్యేక రైళ్లు కుంభమేళాకు ఏర్పాటు చేసారు. విమాన యాన సంస్థలు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. యూపీ ప్రభుత్వం కుంభమేళా కోసం దాదాపు రూ 7,500 కోట్లు ఖర్చు చేస్తోంది. అదే సమయంలో కుంభమేళా నిర్వహణ ద్వారా యూపీ ప్రభుత్వానికి ఆదాయం బాగా వస్తుందనే అంచనాలు ఉన్నాయి. తొలి మూడు రోజుల్లోనే కుంభమేళాకు వస్తున్న భక్తులతో అంచనాలు మారుతున్నాయి.












Click it and Unblock the Notifications