కాంగ్రెస్ కీలక నిర్ణయం.. !!
Maharashtra Assembly elections polling 2024: జార్ఖండ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. మొత్తం 38 నియోజకవర్గాల్లో పలువురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.
అటు మహారాష్ట్రలో 288 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. జార్ఖండ్‌తో పోల్చుకుంటే మహారాష్ట్రలో తొలి రెండు గంటల్లో పోలింగ్ మందకొడిగా సాగడం గమనార్హం. మధ్యాహ్నం 3 గంటల సమయానికి జార్ఖండ్‌లో 61.47 శాతం మేర పోలింగ్ రిజిస్టర్ అయింది. మహారాష్ట్రలో ఈ సంఖ్య 45.53 శాతమే.

ఈ రెండింటితో పాటు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కూడా ముమ్మరంగా సాగుతోంది. మహారాష్ట్రలోని నాందెడ్ లోక్‌సభ నియోజకవర్గానికీ ఉప ఎన్నిక నేడే జరుగుతోంది. కాంగ్రెస్ సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడు వసంత్ రావ్ బల్వంత్ రావ్ చవాన్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అవసరమైంది.
పాలక్కాడ్- కేరళ, ఛబ్బెవాల్- పంజాబ్, గిద్దర్‌బాహా- పంజాబ్, డేరా బాబా నానక్- పంజాబ్, బర్నాలా- పంజాబ్, ఘజియాబాద్- ఉత్తర ప్రదేశ్, మఝవాన్- ఉత్తర ప్రదేశ్, మీరాపూర్- ఉత్తర ప్రదేశ్, ఖైర్- ఉత్తర ప్రదేశ్, ఫూల్‌పూర్- ఉత్తర ప్రదేశ్, కుందార్కి- ఉత్తర ప్రదేశ్, కర్హాల్, కటేహారి- ఉత్తర ప్రదేశ్, కేదార్‌నాథ్- ఉత్తరాఖండ్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఆయా ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడతాయి.
కాగా- పోలింగ్ ప్రక్రియ మగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై తాము నిర్వహించిన సర్వేలు, ఎగ్జిట్ పోల్స్‌పై తమ అంచనాలను వెల్లడించనున్నాయి. ఇదివరకు హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పెద్దగా వాస్తవ రూపాన్ని దాల్చని నేపథ్యంలో ఈ సారి ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.
కాగా- ఈ పరిణామాల మధ్య అఖిల భారత కాంంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా టీవీ ఛానళ్లు, వివిధ మీడియా సంస్థలు నిర్వహించబోయే డిబేట్లల్లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ఈ చర్చల్లో పార్టీ తరఫున ఎవ్వరూ పాల్గొనకూడదని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా పాల్గొంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయమౌతుందని పేర్కొంది.
టీవీ ఛానళ్లు తమ టీఆర్పీ రేటింగ్స్‌ను పెంచుకోవడానికి ఇలాంటి డిబేట్లను పెడుతుంటాయని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది. ఈ ఏడాది ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌కు కూడా కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రజా తీర్పు ఈవీఎంలల్లో నిక్షప్తమైందని, రాజెవరో, బంటెవరో ఓట్ల లెక్కింపులో తేలుతుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications