ముగిసిన ఎన్నికల ప్రచారం..ఎన్ని వేల కోట్ల డబ్బు సీజ్ చేశారంటే..?
ఈనెల 20న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం నేటితో ముగిసింది. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు విసృతంగా ప్రచారం నిర్వహించారు. మరో రెండు రోజుల్లో ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసింది. ఇక ఎన్నికల సమయంలో భారీగా నగదు పట్టుబడింది.
ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ భారీగా అక్రమ నగదును సీజ్ చేసింది. దాదాపు రూ.1082 కోట్లకు పైగా విలువైన డబ్బు, మద్యం, ఆభరణాలు, ఇతర వస్తువులు ఈసీ సీజ్ చేసిన వాటిలో ఉన్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా పలు రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను అడ్డుకొనేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు రూ.1082 కోట్ల విలువైన ఎన్నికల తాయిలాలను సీజ్ చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు మొత్తంగా రూ.1082.2 కోట్ల విలువైన ఎన్నికల తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలిపింది.సీజ్ చేసిన వాటిలో రూ.182 కోట్ల నగదు, రూ.120 కోట్ల మద్యం, రూ.124 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.303 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.355 కోట్ల విలువైన ఉచితాలు.. ఇతర వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు.మహారాష్ట్రలో రూ.660 కోట్లు.. జార్ఖండ్ లో 198 కోట్లు.. మిగతా చోట్ల జరుగుతున్న ఉప ఎన్నికల్లో రూ.223 కోట్లు ఉన్నట్టు ఈసీ తెలిపింది. ఈ నెల 20న పోలింగ్ జరగనున్న వేళ రాబోయే రెండు రోజులు గట్టి నిఘా ఉంచనున్నట్లు ఈసీ తెలిపింది.












Click it and Unblock the Notifications