మహారాష్ట్ర లో జగన్ సీన్ రిపీట్ - చంద్రబాబు ఫార్ములాతో బీజేపీ...!!
మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఎవరు. మహాయుతి కూటమిగా పోటీ చేసిన మూడు పార్టీల నుంచి రేసులో ఉన్నారు. అదే సమయంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు. తాజా ఫలితాల తరువాత ఈ ఆసక్తి కర చర్చ మొదలైంది. కొత్త సీఎం పైన రేపు బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే, మరి ప్రతిపక్ష నేతగా ఎంవీఏ నుంచి ఎవరికీ ఛాన్స్ దక్కే పరిస్థితి కనిపించటం లేదు. ఏపీలో మాజీ సీఎం జగన్ ఎదుర్కొన్న పరిస్థితే ఇక్కడ రిపీట్ అవుతోంది. దీంతో, బీజేపీ నిర్ణయం కీలకంగా మారనుంది.
కాబోయే సీఎం ఎవరు
మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చింది. అనూహ్య ఫలితంతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. మహాయుతి నుంచి సీఎం రేసులో మూడు పార్టీల ముఖ్య నేతలు రేసులో ఉన్నారు. మాజీ సీఎం ఫడ్నవీస్, షిండేతో పాటుగా అజత్ పవార్ సైతం సీఎం సీటు ఆశిస్తున్నారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశం రేపు (సోమవారం) జరగనుంది. దీనికి ముందే బీజేపీ అధినేతలు షిండే, అజిత్ పవార్ తో మంత్రాంగానికి సిద్దమయ్యారు. బీజేపీ నుంచి ఫడ్నవీస్ సీఎంగా, షిండే - అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. షిండే వర్గం మాత్రం తమకే సీఎం పదవి కావాలని పట్టబడుతోంది. దీంతో, చివరి నిమిషంలో చోటు చేసుకునే రాజకీయం పైన ఆసక్తి కొనసాగుతోంది.

ఏపీ సీన్ రిపీట్
ఇక, మహారాష్ట్రలో తొలి సారి ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి దక్కలేదు. దీంతో ప్రతిపక్ష నేత పదవి ఖాళీగా ఉండనుంది. మూడు పార్టీల కూటమిగా పోటీ చేసిన ఏ పార్టీకి సభలో ప్రతిపక్ష హోదా కు కావాల్సిన సంఖ్యా బలం రాలేదు. కూటమిగా ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉండదు. ఈ మేరకు మహా వికాస్ ఆఘాడీ పార్టీలు కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)కు ఎల్ఓపీ అవకాశం లేదని మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి(లెజిస్లేచర్) అనంత్ కల్సే ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి బలం ఆధారంగా ఎల్ఓపీని నామినేట్ చేయడం కుదరదని, నిబంధనల ప్రకారం ఏ పార్టీకి అయినా కచ్చితంగా కనిష్ఠ సంఖ్యలో సభ్యుల బలం ఉండాలని స్పష్టం చేసారు.
బీజేపీ నిర్ణయం ఏంటి
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్ష హోదా కావాలంటే 29 సీట్లు రావాలి. కాంగ్రెస్ కూటమిలోని ఏ ఒక్క పార్టీకి 29 సీట్లు రాలేదు. శివసేన(యూబీటీ) 20 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ 16, ఎన్సీపీ(ఎస్పీ) 10 సీట్లకు పరిమితమైంది. ఇక మహాయుతిలో బీజేపీ సింహభాగం 132(149 సీట్లలో పోటీ చేసి) స్థానాల్లో విజయం సాధించింది. ఏపీలోనూ తాజా ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో, ప్రతిపక్ష హోదా దక్కలేదు. మిగిలిన మూడు పార్టీలు అధికార కూటమిలో ఉండటంతో.. తామే ప్రతిపక్ష పార్టీ అని.. తమకు ఆ హోదా ఇవ్వాలంటూ జగన్ కోర్టును ఆశ్రయించారు. ఇక, ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications