ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది కార్మికులు దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 12 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో ఈ మధ్యాహ్నం ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుల్ధానా నుంచి కొంతమంది కార్మికులను ఎక్కించుకున్న ట్రక్కు.. సమృద్ధి హైవే ప్రాజెక్ట్ నిర్మాణ ప్రదేశానికి బయలుదేరింది. ముంబై-నాగ్‌పూర్‌ను కనెక్ట్ చేసే ప్రాజెక్టు ఇది. ఈ జాతీయ రహదారి నిర్మాణంలో పలువురు కార్మికులు పనిచేస్తోన్నారు. వారిలో కొందరు బుల్ధానా జిల్లా కేంద్రంలో నివసిస్తోన్నారు. బుల్ధానా నుంచి వారిని తరలించడానికి రోజూ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

సింద్‌ఖెద్రజ-మెహకర్ మధ్య రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఎప్పట్లాగే ఈ మధ్యాహ్నం కూడా కార్మికులను ఎక్కించుకున్న వాహనం నిర్మాణ ప్రదేశానికి బయలుదేరింది. మార్గమధ్యలో కింగావ్‌రజా పోలీస్ స్టేషన్ పరిధిలోని తడేగావ్ ఫటా సమీపంలోని దుసర్‌బిద్ గ్రామం సమీపంలోకి రాగానే ఆ వెహికల్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 12 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే బుల్ధానా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అరవింద్ ఛావ్రియా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పొరుగునే ఉన్న జాల్నా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాహనం అదుపుతప్పి బోల్తా పడటం వల్ల ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.












Click it and Unblock the Notifications