ఆక్సిజన్ మాస్కుతో కరోనా రోగి నిరసన: ఆస్పత్రుల చుట్టూ తిరిగి ప్రాణాలు కోల్పోయాడు
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన చేపట్టిన ఓ 38 ఏళ్ల కరోనా బాధితుడు బుధవారం అర్ధరాత్రి తర్వాత మృతి చెందారు. బుధవారం సాయంత్రం బాబా సాహెబ్ కోలే అనే కరోనా రోగి.. ఆక్సిజన్ మాస్కు(సిలిండర్‌కు అనుసంధానించబడిన మాస్కు)తో నాసిక్ పురపాలక కేంద్ర కార్యాలయం వద్ద కుటుంబసభ్యులతోపాటు నిరసనకు దిగాడు.
ఏ ఆస్పత్రి కూడా చేర్చుకోకవడంతో ఈ నిరసన చేపట్టారు. కాగా, ఓ గంట తర్వాత అతడ్ని కార్పొరేషన్ సిబ్బంది.. మున్సిపల్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం అర్ధరాత్రి వరకు కరోనా బాధితుడి ఆక్సిజన్ శాతం 40 శాతానికి పడిపోయిందని అతని కుటుంబసభ్యులు తెలిపారు. సాధారణంగా ఆక్సిజన్ శాతం 95 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. కాగా, గురువారం తెల్లవారుజామున ఒంటిగంటలకు బాబా సాహెబ్ మరణించారు.

'రెండు మూడ్రోజుల క్రితం అతడ్ని బైట్కో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత అతడు వేరే ఆస్పత్రికి వెళ్లాడు. ఆ తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరారు. మెడికల్ కాలేజీలో బెడ్ లేదని చెప్పారు. దీంతో మరికొన్ని ఆస్పత్రులు తిరిగాం. ఎవరూ కూడా అతడ్ని అడ్మిట్ చేసుకోలేదు. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి ఆక్సిజన్ మాస్క్ పెట్టించాము. అయితే, అక్కడ కూడా ఎవరూ పట్టించుకోలేదు' అని బాధితుడి భార్య మీడియాతో వాపోయారు.
బాధితుడిని చేర్చుకోని ఆస్పత్రి బాధ్యతులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పోలీసులు, కార్పొరేషన్ అధికారులు బాధ్యలను గుర్తించే పనిలో ఉన్నారు. కాగా, మహారాష్ట్రలో గత కొన్ని వారాలుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది.
బుధవారం మహారాష్ట్రంలో కొత్తగా 40వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ముంబైలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 1.22 కోట్ల కేసులతో భారతదేశం.. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానంలో ఉంది.












Click it and Unblock the Notifications