ప్రతి నెలా రూ. 2,100 నగదు బదిలీ
Maharashtra Assembly elections 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో రోడ్‌షోలు, బహిరంగ సభలతో హోరెత్తిపోతోంది మహారాష్ట్ర.
288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తేలేది అప్పుడే.

ఈ క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఎన్సీపీ చీలిక వర్గం అధినేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. ఈ మధ్యాహ్నం దీన్ని విడుదల చేశారు. అధికారంలోకి వస్తే అమలు చేయబోయే హామీలను ఇందులో పొందుపరిచారు.
మొత్తం 11 హామీలను ఇచ్చింది ఎన్సీపీ. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న మఝీ లడ్కీ బెహన్ పథకాన్ని కొనసాగిస్తామని అజిత్ పవార్ వెల్లడించారు. అర్హులైన మహిళలకు ఈ పథకం కింద ప్రస్తుతం ప్రతి నెలా అందజేస్తోన్న 1,500 రూపాయల ఆర్థిక సహాయం మొత్తాన్ని 2,100 రూపాయలకు పెంచినట్లు తెలిపారు.
అలాగే షెట్కారీ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం అందజేసే మొత్తాన్ని 12,000 నుంచి 15,000 రూపాయలకు పెంచింది ఎన్సీపీ. రైతుల రుణ మాఫీ, కనీస మద్దతు ధర కల్పించడం, 20 శాతం మేర అదనపు బోనస్, వరి పంటకు ప్రతి సంవత్సరం ఒక్కో హెక్టార్‌కు 25,000 రూపాయల బోనస్ వంటి హామీలు ఇందులో ఉన్నాయి.
మేనిఫెస్టో విడుదల సందర్భంగా అజిత్ పవార్ మాట్లాడారు. రాష్ట్రంలో ఏర్పడబోయేది తమ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే మేనిఫెస్టోను అమలు చేస్తామని అన్నారు. ఉద్యోగాల కల్పనకూ అధిక ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. గ్రామీణ రోడ్ల మరమ్మత్తుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని అజిత్ పవార్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications